పండుగ వేళ ‘తీపి’ విషం: నగరంలో స్వీట్ షాపుల బరితెగింపు.. TG-SAFE కొరడా!

Hyd Sweet Shops

Hyd Sweet Shops

హైదరాబాద్: పండుగ వచ్చిందంటే చాలు.. ఇళ్లన్నీ పిండివంటలు, రకరకాల మిఠాయిల ఘుమఘుమలతో కళకళలాడాలి. కానీ భాగ్యనగరంలో పేరుమోసిన స్వీట్ షాపుల కిచెన్లలోకి తొంగిచూస్తే మాత్రం వాంతులు వచ్చేంత దారుణ దృశ్యాలు కంటపడుతున్నాయి. ప్రజల పండుగ ఉత్సాహాన్ని సొమ్ము చేసుకుంటూ, నిలువునా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న మిఠాయి దుకాణాలపై తెలంగాణ ఆహార భద్రతా విభాగం (TG-SAFE) అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు.

తీపి ముసుగులో కల్తీ దందా: కిచెన్లలో కళ్లుతిరిగే నిజాలు ఎంతో ఆర్భాటంగా, తళతళలాడే గాజు షోకేసుల్లో అమర్చే మిఠాయిల వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. ఫుడ్ వింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలకు చెందిన 12 ప్రత్యేక బృందాలు గ్రేటర్ పరిధిలోని 17 ప్రముఖ స్వీట్ షాపులను జల్లెడ పట్టాయి. తయారీ కేంద్రాల్లోకి అడుగుపెట్టిన అధికారులకే దిమ్మతిరిగే పరిస్థితులు కనిపించాయి:

కుళ్ళిన ముడిసరుకు: బూజు పట్టిన పదార్థాలు, పురుగులు పట్టిన వేరుశెనగ పల్లీలు, నిల్వ ఉంచిన రసాయన నూనెలు నేరుగా మిఠాయిల తయారీలో వాడుతున్నారు.

ఎక్స్‌పైరీ స్వీట్లతో కొత్త స్వీట్లు: గడువు ముగిసిన, అమ్ముడుపోని పాత స్వీట్లను పారేయకుండా.. వాటినే మళ్లీ వేడి చేసి, రంగులు, పంచదార పాకం జోడించి కొత్త స్వీట్లుగా మార్చి కస్టమర్ల నెత్తిన రుద్దుతున్నారు.

నరకప్రాయమైన వాతావరణం: ఈగలు ముసిరిన గదులు, మురికి నీరు నిలిచిన నేలలు, చేతులకు గ్లౌజులు గానీ, తలలకు క్యాపులు గానీ లేకుండా అత్యంత మురికిగా ఉన్న కార్మికులు మిఠాయిలను తయారుచేస్తూ కనిపించారు.

ఆరోగ్యాలతో చెలగాటం ఆడితే వేటు తప్పదు తనిఖీల సందర్భంగా వేల కేజీల కల్తీ, గడువు ముగిసిన మిఠాయిలను అధికారులు అక్కడికక్కడే సీజ్ చేసి నేలమట్టం చేశారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రముఖ సంస్థలపై కఠిన చర్యలు చేపట్టారు. పలు దుకాణాలకు తక్షణ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన పలు ప్రముఖ షాపుల లైసెన్సులను రద్దు చేశారు.

లైసెన్సుల రద్దు, తనిఖీలకు గురైన సంస్థల జాబితాలో శ్రీజ ఫుడ్స్, వాసిరెడ్డి స్వీట్స్, ప్రమోద స్వీట్స్, గోదావరి వంటిల్లు, బాలాజీ రతన్‌లాల్, రామదాస్ స్వీట్స్, స్వీట్ బాస్కెట్, స్వగృహ ఫుడ్స్, అభిరుచి ఫుడ్స్, రాజీవ్ రెడ్డి, శుభం ఫుడ్స్, మిఠాయి మియా, సుదర్శన్ రెడ్డి స్వీట్స్, హనీ ఫుడ్స్, ఆల్మండ్ హౌస్, మధుర స్వీట్స్, మెజిస్టిక్ స్వీట్స్ తదితరాలు ఉన్నాయి.

పండుగల సీజన్‌లో కాసుల కక్కుర్తితో నాణ్యతలేని, కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే ఎంతటి పేరున్న బ్రాండ్ అయినా ఉపేక్షించేది లేదని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రతా అధికారులు స్పష్టం చేశారు. వినియోగదారులు కూడా స్వీట్లు కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.