హైదరాబాద్ జిల్లా పరిధిలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఎన్యూమరేషన్ ఫారమ్‌ల సమర్పణ ప్రక్రియ నేటితో ముగియనుంది. మరో కొన్ని గంటల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా పూర్తి కానుండటంతో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం గడువును మరో వారం రోజులు పొడిగించినప్పటికీ హైదరాబాద్‌లో డిజిటలైజేషన్ ప్రక్రియ ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోకపోవడం గమనార్హం. ప్రస్తుతం జిల్లాలో డిజిటలైజేషన్ నమోదు శాతం కనీసం 60 శాతానికి కూడా చేరుకోలేదు.
ఎలక్షన్ కమిషన్ పొడిగించిన ఈ ఏడు రోడుల గడువులో ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణ కేవలం నాలుగు శాతం లోపే పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రజల నుంచి తగినంత స్పందన రాకపోయినప్పటికీ, బూత్ స్థాయి అధికారులు (BLO) మాత్రం సెలవు రోజుల్లో కూడా విధుల్లో పాల్గొంటూ ఇళ్లకు వెళ్లి ఫారమ్‌లను సేకరిస్తున్నారు. నగరంలో సుదీర్ఘకాలంగా నివాసముంటున్న ఓటర్లలో చాలామంది తమ సొంత గ్రామాలు, స్వస్థలాల్లోనే ఓటు హక్కును ఉంచుకోవడానికి మొగ్గు చూపడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 48 లక్షల మంది ఓటర్ల జాబితా ఉండగా, అందులో దాదాపు 28 లక్షల మంది మాత్రమే ప్రస్తుతం నగరంలో నమోదు చేసుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న ప్రతి ఎన్యూమరేషన్ ఫారమ్‌ను సమగ్రంగా రీ-వెరిఫై చేసిన అనంతరమే సిస్టమ్‌లో డిజిటలైజేషన్ చేస్తున్నామని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ (AERO) స్పష్టం చేశారు. తప్పుడు సవరణలకు లేదా పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా ఈ ప్రక్రియను ముగిస్తున్నామని తెలిపారు.

