Scrap Shop Explosion: నగరంలోని రామంతాపూర్ చర్చ్ కాలనీ పరిధిలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో ఆదివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో స్క్రాప్ వ్యాపారి తీవ్రంగా గాయపడగా, దుకాణంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. చర్చ్ కాలనీలోని స్క్రాప్ దుకాణంలో డీలర్ పరశురామ్ లోహపు వ్యర్థాలను కట్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు చోటుచేసుకుంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పాటు దుకాణమంతటా నిమిషాల వ్యవధిలోనే మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో పరశురామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కాలిన గాయాలతో బయటకు వచ్చిన అతడిని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌లో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి శరీరంలో సుమారు 70 శాతం వరకు కాలిన గాయాలు కావడంతో ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రెండు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడుకు గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. స్క్రాప్ కటింగ్ సమయంలో ఏదైనా రసాయన పాత్ర లేదా గ్యాస్ సిలిండర్ లాంటి వస్తువు పేలిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

