ఎండ ప్రచండ కిరణాలనుంచి హైదరాబాద్ వాసులకు ఉపశమనం కలిగింది. వాతావరణ శాఖ అంచనాలు నిజమయ్యాయి. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం, తూర్పు ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రంలో ఉన్న అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదిలి, ఈరోజు 0830 గంటల IST సమయంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద తీవ్ర అల్పపీడనంగా ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది అండమాన్ నికోబార్ దీవుల వెంబడి ఉత్తర దిశగా దాదాపుగా కదులుతూ, మార్చి 20 ఉదయం నాటికి వాయుగుండంగా మరియు మార్చి 21న తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదులుతూ 22 మార్చి, 2022 న బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.
నేడు, ఎల్లుండి తేలికపాటి నుంచి.. మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రేపు మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపినట్టుగానే పలు ప్రాంతాల్లో వాన పడింది. భాగ్యనగరం చల్లబడింది. మహాశివరాత్రి ముగిసి.. చలికాలం పోయింది. తెలంగాణలో కొన్ని రోజులుగా సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. వేడితో అల్లాడిపోతున్న రాజధాని వాసులకు ఒక్కసారిగా చిరుజల్లులతో ఉపశమనం లభించింది.
హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారడంతో జనం రిలీఫ్ ఫీలవుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో పాటు, వర్షం కురిసింది. అంబర్‌పేట్, నారాయణగూడ, బహుదూర్‌పురా, పాతబస్తీ, దుండిగల్, సూరారం, దూలపల్లికాలాపత్తర్, జూపార్క్, ఫలక్‌నుమా ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. చంపాపేట్, సైదాబాద్, సరూర్‌నగర్, చైతన్యపురి, మలక్‌పేట్ వానపడింది. ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్‌లో వర్షం పడింది. వికారాబాద్ జిల్లా తాండూరులో వర్షం కురిసింది.
