Water Tankers Strike: హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల బంద్.. రోడ్లపై వేల లీటర్ల నీరు.!

  • ప్రైవేట్ ట్యాంకర్ల యజమానుల నిరసన
  • ట్యాంకర్లను అడ్డుకుని రోడ్లపై నీటి పారబోత
  • అక్రమ బోర్ల తొలగింపుపై ఆగ్రహం
  • ప్రత్యామ్నాయం చూపాలంటూ ప్రభుత్వానికి డిమాండ్
Water Tankers

Water Tankers

హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల యజమానులు తలపెట్టిన బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రెవెన్యూ , హైడ్రా (HYDRAA) అమలు చేస్తున్న విధానాల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ ప్రైవేట్ ట్యాంకర్ల సంఘం ప్రతినిధులు ఈ నిరసన చేపట్టారు. బంద్ కారణంగా నగరంలో ఎక్కడా ప్రైవేట్ ట్యాంకర్లు రోడ్లపైకి రావద్దని హెచ్చరిస్తూ, నిబంధనలను ధిక్కరించి తిరుగుతున్న ఇతర ట్యాంకర్లను అడ్డుకున్నారు. అంతేకాకుండా, ట్యాంకర్లలోని వేల లీటర్ల విలువైన మంచినీటిని రోడ్లపైనే బలవంతంగా పారబోసి తమ నిరసనను వినూత్నంగా ప్రదర్శించారు.

అక్రమ బోర్ల తొలగింపుపై యజమానుల ఆగ్రహం

నగరంలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా కొన్ని రోజులుగా హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలతో పాటు చెరువుల పక్కన వేసిన అక్రమ బోర్లను సైతం కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము వాటర్ ట్యాంకర్ల వ్యాపారం కోసం ఏర్పాటు చేసుకున్న బోర్లను కూడా హైడ్రా అక్రమమంటూ తొలగిస్తోందని ట్యాంకర్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా బోర్లను తొలగించడం వల్ల తమ జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటోందని వాపోయారు. ప్రభుత్వ విధానాల వల్ల ఉపాధి కోల్పోతున్నామని, అధికారులు వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.