Cricket Betting : ఒక సరదా ప్రాంక్ మెసేజ్ హైదరాబాద్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును రట్టు చేసింది. తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఒక యువకుడు తన ప్రియురాలికి పంపిన మెసేజ్, చివరికి పోలీసులను అతడి ఫ్లాట్ వరకు నడిపించి రూ. 30 లక్షల అక్రమ బెట్టింగ్ సొమ్మును బయటపెట్టేలా చేసింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (KPHB) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది.
కిడ్నాప్ డ్రామా.. 112కు సమాచారం ఇచ్చిన యువతి
పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్ అనే ముగ్గురు యువకులు కేపీహెచ్‌బీలోని ఒక ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో అందులోని ఒక యువకుడు సరదా కోసం తనను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ప్రియురాలికి మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్ చూసి తీవ్ర భయాందోళనకు గురైన సదరు యువతి, నిజంగానే కిడ్నాప్ జరిగిందేమోనని భావించి తక్షణమే ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది.
ఫ్లాట్‌పై పోలీసుల దాడి.. బయటపడ్డ రూ. 30 లక్షల నగదు
యువతి ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన రంగంలోకి దిగిన కేపీహెచ్‌బీ పోలీసులు, బాధితుడు ఉన్నట్లు భావించిన ఫ్లాట్‌కు వెళ్లి సోదాలు చేపట్టారు. అయితే అక్కడ పోలీసులకు కిడ్నాపర్లు ఎవరూ కనిపించలేదు కానీ, భారీ స్థాయిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యవహారం బయటపడింది. ఫ్లాట్‌లో జరిపిన తనిఖీల్లో లెక్కల్లో లేని రూ. 30 లక్షల నగదుతో పాటు బెట్టింగ్‌కు ఉపయోగిస్తున్న పలు మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్.. విచారణ ముమ్మరం
ప్రాంక్ మెసేజ్ పంపిన యువకుడితో పాటు ఫ్లాట్‌లో ఉన్న ఏపీకి చెందిన సుమంత్, మనోజ్, గౌతమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న రూ. 30 లక్షల నగదు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ ద్వారా వసూలు చేసిన సొమ్ముగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేవలం ప్రియురాలితో ఆడుకున్న ఒక్క ప్రాంక్ మెసేజ్ వల్ల ఈ బెట్టింగ్ ముఠా మొత్తం పోలీసులకు చిక్కింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ బెట్టింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం విచారణ వేగవంతం చేశారు.

