Suspended: మహిళా ఎస్సై అక్రమ వసూళ్లపై సజ్జనార్ ఆగ్రహం.. సస్పెన్షన్ వేటు..

Suspend

Suspend

శాంతిభద్రతలను పరిరక్షించి ప్రజలకు భరోసా కల్పించాల్సిన పోలీసులే కంచె చేను మేసిన చందంగా వ్యవహరిస్తుండటం జంట నగరాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కిందిస్థాయి సిబ్బంది నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకు కొందరు అధికారులు అక్రమ వసూళ్లు, దౌర్జన్యాలకు తెగబడుతూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. తాజాగా కుల్సుంపుర సబ్‌డివిజన్ పరిధిలోని ఓ ఠాణాలో విధులు నిర్వహిస్తున్న 2024 బ్యాచ్ మహిళా ఎస్సై వ్యవహారం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది.

కనీసం ప్రొబేషనరీ కాలం కూడా పూర్తికాకముందే ఆమె ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు, సివిల్ తగాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు ఆధారాలతో ఫిర్యాదులు అందాయి. దీనిపై ఇటీవల నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విధుల నుంచి రిలీవ్ చేసి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ సస్పెన్షన్ వేటు వేశారు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు కానిస్టేబుళ్లపైనా క్రమశిక్షణ చర్యలకు రంగం సిద్ధం చేశారు.

మరోవైపు జంట నగరాల్లో వరుస ఏసీబీ దాడులు పోలీసు శాఖ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. మల్కాజిగిరి జోన్ పరిధిలోని జవహర్‌నగర్ ఠాణాలో కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఇన్‌స్పెక్టర్, ఎస్సై వేర్వేరు కేసుల్లో లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. అలాగే సివిల్ వివాదంలో జోక్యం చేసుకుని రూ. 3 లక్షల లంచం తీసుకుంటూ మీర్‌చౌక్ ఇన్‌స్పెక్టర్ కొండల్ రావు, ఓ కానిస్టేబుల్ పట్టుబడగా, ఓ కేసు విషయంలో రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేసిన బంజారాహిల్స్ ఎస్సై విజయ్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది.

అంతేకాకుండా కొందరు సిబ్బంది ఏకంగా దోపిడీ దొంగల అవతారమెత్తుతున్నారు. ఫిల్మ్‌నగర్ పరిధిలో ఓ బైకిస్ట్‌పై దాడి చేసి నగదు, బంగారం దోచుకున్న ఘటనలో పోలీసు సిబ్బంది అరెస్టయ్యారు. సైఫాబాద్‌లోనూ ఇదే తరహా దోపిడీ జరగగా, సనత్‌నగర్ పరిధిలో ఓ వాహనదారుడి వద్ద లంచం తీసుకుంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డంగా దొరికిపోయారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అవినీతికి పాల్పడే వారిపై సస్పెన్షన్లు, అరెస్టులకు వెనుకాడబోమని, సిబ్బంది తమ పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు.