ఐవీఎఫ్ సెంటర్ల పేరుతో జరుగుతున్న అక్రమాలపై మల్కాజిగిరి పోలీసులు దూకుడు పెంచారు. ఉపాధి పేరుతో యువతులను హైదరాబాద్ కు తీసుకొచ్చి, వారి నుంచి అండాలను సేకరిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేసినట్లు సమాచారం. ఈ కేసులో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ను బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. పలు ఐవీఎఫ్ కేంద్రాలు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నడుపుతూ, అక్కడే అక్రమ దందాలు నడుపుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఉద్యోగం కోసం హైదరాబాద్ కు వచ్చిన యువతులను ట్రాప్ చేసి, మంచి జీతం, షెల్టర్ ఇప్పిస్తామని నమ్మించి తీసుకొస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు. జీతానికి ఆశపడి వచ్చిన యువతుల నుంచి బలవంతంగా అండాలను సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో యువతి నుంచి పదేపదే అండాలను సేకరించడం వల్ల వారి ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో గుజరాత్ తో పాటు హైదరాబాద్ కు చెందిన ముఠా సభ్యులే కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మెడికల్ డిపార్ట్ మెంట్ అనుమతి లేకుండానే అండాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం అండాల సేకరణ వివరాలను తప్పనిసరిగా మెడికల్ డిపార్ట్ మెంట్ లో, ఏఆర్టీకి నమోదు చేయాలి. కానీ యువతుల వివరాలను ఏఆర్టీకి ఇవ్వకుండానే అండాలను సేకరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి తప్పుడు సమాచారాన్ని ఏఆర్టీకి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన యువతుల ఆధార్ కార్డుల అడ్రస్ లు మార్చి ఏఆర్టీకి సమర్పిస్తున్న ప్రవీణ్ ను బేగంపేట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అతడి నుంచి నకిలీ ఆధార్ తయారీకి సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో భాగంగా అధికారులు ఏకంగా 20 ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నోటీసులు అందుకున్న వాటిలో నోవా ఫెర్టిలిటీ సెంటర్, బటర్ ఫ్లై ఫెర్టిలిటీ సెంటర్, ఇందిరా ఫెర్టిలిటీ సెంటర్, నర్మదా ఫెర్టిలిటీ సెంటర్, బిర్లా ఫెర్టిలిటీ సెంటర్, అన్వి ఫెర్టిలిటీ సెంటర్, కాంశివ ఫెర్టిలిటీ సెంటర్, మర్రి తులసి రెడ్డి సెంటర్, 49 ఫెర్టిలిటీ సెంటర్, మమత ఫెర్టిలిటీ సెంటర్, సద్గురు ఏఆర్టీ సెంటర్, నోవా ఐవీఎఫ్ సెంటర్, ఫాతిమా ఫెర్టిలిటీ సెంటర్, ఆరాధ్య ఐవీఎఫ్ సెంటర్ తదితరాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సెంటర్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా, అండాల సేకరణ వివరాలు సక్రమంగా నమోదు చేశారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరింత మంది నిందితుల ప్రమేయం ఉందా, ఇతర రాష్ట్రాలతో లింకులు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

