Honey Trap: హైదరాబాద్‌లో హనీ ట్రాప్ కలకలం.. నకిలీ ఖాతాలతో వేల మందికి టోకరా

  • యువతుల పేర్లతో నకిలీ ఖాతాలు
  • ప్రైవేట్ ఫొటోలతో బెదిరింపులు.. రూ.25 లక్షలు వసూలు
  • వెయ్యి మందికి పైగా బాధితులు ఉన్నట్లు గుర్తింపు
  • విదేశీయులకూ విస్తరించిన హనీ ట్రాప్
Honey Trap

Honey Trap

సోషల్ మీడియాలో తెలియని వ్యక్తులతో పరిచయాలు ఎంతటి ప్రమాదకరంగా మారుతాయో తెలిపే ఒక సంచలన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా వేదికగా అందమైన యువతులంటూ నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, అమాయకులను బుట్టలో వేసుకుంటూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. చార్మినార్ డిసిపి కిరణ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

ఎలా సాగింది ఈ హనీ ట్రాప్ దందా?

ఈ కేసులో కొండాబత్తుల పవన్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఇతను బి.టెక్ (B.Tech) డ్రాపవుట్ అని తేలింది. పవన్ సోషల్ మీడియాలో అమ్మాయిల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి, అమాయక యువకులను ఆకర్షించేవాడు. వారితో చనువుగా చాటింగ్ చేస్తూ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను సేకరించేవాడు. ఆ తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని బాధితులను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించేవాడు. ఎవరికైనా చెబితే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఇప్పటి వరకు సుమారు రూ. 25 లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

విదేశాలకూ పాకిన వేర్లు.. 1000 మందికి పైగా బాధితులు

ఈ మోసాల పరిధి చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. దాదాపు 1000 మందికి పైగా వ్యక్తులు ఇతని నకిలీ ఖాతాలతో చాటింగ్ చేసినట్లు తేలింది. వీరిలో ప్రస్తుతం 82 మందికి సంబంధించిన సున్నితమైన ప్రైవేట్ డేటా, ఫోటోలు, వీడియోలు నిందితుడి వద్ద ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. విశేషం ఏంటంటే.. బాధితులలో కేవలం స్థానికులు మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు మరియు పాకిస్తాన్, కెనడా, టర్కీ వంటి విదేశీ దేశాల వారు కూడా ఉండటం గమనార్హం.

పోలీసుల హెచ్చరికలు.. అప్రమత్తంగా ఉండాలని సూచన

సోషల్ మీడియాను నమ్మి ఈ విధంగా మోసపోతున్న వారి ఉదంతాలు పెరుగుతున్న నేపథ్యంలో చార్మినార్ డిసిపి కిరణ్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పరిచయం లేనివారితో చాటింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకునేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ నేరాలు లేదా బ్లాక్‌మెయిల్‌కు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయాలని సూచించారు.