Site icon NTV Telugu

Hyderabad: గజగజ వణికిన హైదరాబాద్. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి

Cold

Cold

హైదరాబాద్‌ నగరం వారం రోజులపాటు గజగజా వణికిపోయింది. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల అధిక చలి వాతావరణం నెలకొంది. గత 54 ఏళ్లలో ఇంత తక్కువ టెంపరేచర్లు నమోదుకావటం ఇదే తొలిసారి. జూలై 13వ తేదీన ఉష్ణోగ్రత అత్యంత తక్కువ(20 డిగ్రీల సెల్సియస్‌)కు పడిపోయింది. 1968 జూలైలో ఓ రోజు 18.6 డిగ్రీల సెల్సియస్‌ టెంపరేచర్‌ రికార్డవగా ఇప్పటివరకు అదే కోల్డెస్ట్‌ డేగా నిలిచింది. ఈ నెల 13న ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో సెకండ్‌ కోల్డెస్ట్‌ డేగా నమోదైంది.

ఇదే నెల 10వ తేదీన కూడా టెంపరేచర్‌ 20.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవటంతో థర్డ్ కోల్డెస్ట్‌ డేగా ఇండియా వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఐఎండీ డేటా ప్రకారం ఈ నెల 11న 21 డిగ్రీలు, 12న 20.8, 14న 21.3 డిగ్రీలు, 15న 22.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. దీన్నిబట్టి చూస్తే భాగ్య నగరం ఇటీవల ఎన్నడూలేనంత చారిత్రక చలి రోజులను అనుభవించినట్లయింది. జూలై 9 నుంచి 5 రోజులపాటు సిటీ మీద దట్టమైన మేఘాలు కమ్ముకోవటం, ఏకబిగిన వర్షం కురవటం, ముసురు దీనికి ప్రధాన కారణాలు.

ఎట్టకేలకు ఈ చలి దుప్పటి నుంచి హైదరాబాద్‌ తేరుకుంది. మేఘాలు తొలిగిపోయి సూర్యుడు కనిపించటంతో ఉష్ణోగ్రతలు యాధా స్థితికి వచ్చేశాయి. అయినప్పటికీ రేపటి నుంచి 19వ తేదీ వరకు ఎల్లో అలర్ట్‌ కొనసాగనుంది. అంటే 7 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడే అవకాశం ఉందని అర్థం. హైదరాబాద్‌తోపాటు నార్తర్న్‌, సెంట్రల్‌ తెలంగాణ పరిధిలోని 10 జిల్లాలకు ఈ హెచ్చరిక వర్తిస్తుంది. ఎల్లో అలర్ట్‌ కింద ఉన్న కొన్ని జిల్లాలు.. నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి.

Exit mobile version