Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!

  • హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం
  • జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు అంతరాయం
  • తెలంగాణకు ఐదు రోజుల వర్ష సూచన
  • పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
Rain In Hyderabad

Rain In Hyderabad

Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శనివారం (జూన్ 6) ఉదయం నుండి భానుడు తన ప్రతాపం చూపిస్తూ, వాతావరణం ఎండ తీవ్రతతో పొడిగా ఉన్నప్పటికీ.. మధ్యాహ్నానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆకాశాన్ని ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్మేసి, నగరం అంతటా దంచికొడుతూ వర్షం కురిసింది. ఈ ఆకస్మిక వర్షంతో గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో మండిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది.

నగరవ్యాప్తంగా వాన జల్లులు.. జలమయమైన రోడ్లు

హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాలైన జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, హిమాయత్ సాగర్, కిస్మాత్ పూర్ పరిసరాల్లో కూడా వాన దంచికొట్టింది. మరోవైపు బషీర్ బాగ్, అబిడ్స్, నారాయణగూడ, నాంపల్లి, కోఠి ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతను తట్టుకోలేక ఇబ్బంది పడ్డ వాహనదారులు, ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో ఈ చిరుజల్లులను ఆస్వాదిస్తూ కనిపించారు. అయితే, వర్షం ఎక్కువగా కురిసిన కొన్ని ఏరియాల్లో ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జలమయమయ్యాయి.

×
×
Ad

తెలంగాణకు మరో ఐదు రోజులు వర్ష సూచన

ఇదిలా ఉండగా, తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణ ప్రాంతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలి

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు, వాహనదారులు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.