Gym Coach: ఫిట్‌నెస్ కోసం జిమ్‌కు వెళ్లే మహిళలకు రక్షణగా ఉండాల్సిన కోచ్.. కామాంధుడిగా మారి నరకం చూపించాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఖరీదైన రాంకీ టవర్స్ జిమ్‌లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడి, ఏళ్ల తరబడి బ్లాక్‌మెయిల్ చేసిన కీచక కోచ్‌కు ఎల్బీనగర్ కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. నిందితుడు మహ్మద్ మౌజం అలీకి ఏకంగా 20 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు రూ. 8 వేల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
అసలు ఏం జరిగిందంటే.. గచ్చిబౌలి రాంకీ టవర్స్‌లోని జిమ్‌లో మహ్మద్ మౌజం అలీ కోచ్‌గా పనిచేసేవాడు. 2015లో అక్కడికి వచ్చే ఓ మహిళపై కన్నేసిన మౌజం అలీ, జిమ్‌లోని లేడీస్ టాయిలెట్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత కూడా అతడి వేధింపులు ఆగలేదు. ఏకంగా బాధితురాలి ఫ్లాట్‌లోకి అక్రమంగా చొరబడి భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ఫోన్, సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేసి దారుణంగా బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
కోచ్ వేధింపులు భరించలేక బాధితురాలు 2017లో రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పక్కా సాక్ష్యాధారాలతో మౌజం అలీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత నిందితుడి నేరం రుజువు కావడంతో, ఎల్బీనగర్ 13వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి ఎం. వాణి అతడికి 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నమ్మకంతో జిమ్‌కు వచ్చే మహిళల జీవితాలతో ఆడుకోవాలని చూసే ఇలాంటి కీచకులకు ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక అని స్థానికులు అంటున్నారు.

