Drug Racket: రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి తెలంగాణ ఈగల్ ఫోర్స్, సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ పోచమ్మ బస్తీలో ఉన్న ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తూ, డ్రగ్స్ సరఫరా చేస్తున్న బంగ్లాదేశ్ జాతీయురాలితో పాటు ఆమె లివ్-ఇన్ పార్ట్‌నర్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి సింథటిక్ డ్రగ్‌తో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు చెందిన ఆల్ఫా కుటుంబ సమస్యలు, కోవిడ్ సమయంలో గార్మెంట్ పరిశ్రమలో ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఉపాధి వెతుక్కుంటూ 2021 డిసెంబర్‌లో టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చింది. సరైన ఉద్యోగం దొరకకపోవడంతో, ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నూర్ అనే వ్యక్తి ఆమె పరిస్థితిని ఆసరాగా చేసుకున్నాడు. వ్యభిచారం ద్వారా భారీగా సంపాదించవచ్చని నమ్మించి ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఆ తర్వాత చెన్నైకి చెందిన రాహుల్, హైదరాబాద్‌కు చెందిన జే, జేకే అనే బ్రోకర్లతో ఆమెకు సంబంధాలు ఏర్పడ్డాయి. వారి ఆదేశాల మేరకు హైదరాబాద్‌తో పాటు నాగ్‌పూర్, కాన్పూర్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, గోవా, ముంబై తదితర నగరాల్లో వ్యభిచారం చేస్తూ నెలకు సుమారు రూ. 75,000 వరకు సంపాదించేది.
2021లో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శ్యామ్‌రావు (35)తో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారి, 2022 నుంచి ఇద్దరూ కలిసి షేక్‌పేట్‌లో సహజీవనం చేయడం ప్రారంభించారు. ఆమె కోసం శ్యామ్‌రావు బంగ్లాదేశ్ కూడా వెళ్లాడు. వీరి బంధం తెలిసిన తర్వాత శ్యామ్‌రావు మొదటి భార్య అతడి నుంచి విడిపోయింది. అయితే శ్యామ్‌రావు ఆఫీస్‌కు వెళ్లిన సమయంలో ఆమె అతనికి తెలియకుండా వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తూ ఉండేది. కస్టమర్ల ప్రభావంతో స్వయంగా సింథటిక్ డ్రగ్స్‌కు బానిసైన ఆమె, గోవాకు చెందిన ఆకాష్ అనే పెడ్లర్ నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో క్రమం తప్పకుండా డ్రగ్స్ తెప్పించుకునేది.
భారతీయురాలిగా చలామణి అయ్యేందుకు జియా శ్యామ్‌రావు పేరుతో నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు సృష్టించింది. ఆ నకిలీ పత్రాలతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఖాతా తెరిచి, డ్రగ్స్ కొనుగోలుకు, అక్రమ సంపాదన దాచుకునేందుకు ఉపయోగించింది. డ్రగ్ పెడ్లింగ్‌లో భారీ లాభాలు ఉండటంతో పరిచయస్తులకు, తన రెగ్యులర్ వ్యభిచార కస్టమర్లకు సింథటిక్ డ్రగ్ సరఫరా చేయడం మొదలుపెట్టింది. ఆమె ప్రభావంతో లివ్-ఇన్ పార్ట్‌నర్ శ్యామ్‌రావు కూడా డ్రగ్స్‌కు బానిసయ్యాడు. గోవా నుంచి ఆమె భారీగా డ్రగ్స్‌తో హైదరాబాద్‌కు వచ్చిందన్న పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్, రాయదుర్గం పోలీసులు షేక్‌పేట్‌లోని నివాసంపై దాడి చేశారు. ఈ దాడిలో ఆల్ఫా, శ్యామ్‌రావులను అదుపులోకి తీసుకుని ఇంట్లో నుంచి సింథటిక్ డ్రగ్, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు చేసి, దీని వెనుక ఉన్న అంతరాష్ట్ర ముఠా, బ్రోకర్ల నెట్‌వర్క్‌పై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

