Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు

  • చెత్త సేకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
  • గ్రీన్ ట్యాంకర్ల సేవలను మరింత విస్తరించాలని ఆదేశం
  • తాగునీటికి బదులుగా శుద్ధి చేసిన నీటి వినియోగం
  • ట్రాఫిక్ తగ్గించేందుకు అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్లపై ప్రణాళికలు
Traficc Free

Traficc Free

హైదరాబాద్ మహానగరాన్ని క్లీన్ సిటీగా, ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్మాణ వ్యర్థాల తరలింపునకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మున్సిపల్ పరిధిలోని వివిధ ఇన్ఫస్ట్రియల్ ఏరియాల్లో చెత్త సేకరణకు ఐలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌ స్కేపింగ్‌, గార్డెనింగ్‌ తో పాటు ఇతర పనులకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో గ్రీన్ ట్యాంకర్స్ ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సీఎం అధికారుకు సూచించారు. నిర్మాణ రంగం, గ్రీనరీ మెయింటెనెన్స్, పార్కుల అభివృద్ధి వంటి అవసరాలకు తాగునీటిని ఉపయోగిస్తున్నారని, దీనికి బదులుగా ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా తాగునీటిని ఆదా చేయవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే జలమండలి తొలివిడతలో 19 మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో గ్రీన్ వాటర్ సరఫరాను మరింత విస్తరించాలని సీఎం సూచించారు.

నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టి ట్రాఫిక్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకురావడానికి అవసరమైన చోట అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాల రాకపోకలు నిరంతరాయంగా కొనసాగేలా చూడాలన్నారు.