Site icon NTV Telugu

Telangana: దంచికొడుతున్న వాన‌లు.. పలు జిల్లాలకు వర్ష సూచనలు

Rain

Rain

వేసవి తాపంతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు వర్షం చల్లబరిచింది. అయితే సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం నీటితో నాళాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా ఉండడంతో ఈ నెల 24 వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌, హనుమకొండ, జనగామ, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక జారీచేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాగల 48 గంటల్లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని వివరించింది.

నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావంతో.. హైద‌రాబాద్ జంట‌న‌గ‌రాల‌తో పాటు ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షం కురిసింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో 12.9 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కిష్టారెడ్డిపేటలో 12.5 సెంటీమీటర్లు, సుల్తాన్‌పూర్‌లో 12.3 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్‌, ములుగు, మహబూబాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, సంగారెడ్డిలో భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, ఆదిలాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ఇక నేడు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసిన నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని ప్రకటించారు.

National Herald Case: నేడు మళ్లీ ఈడీ ముందుకు రాహుల్

Exit mobile version