NTV Telugu Site icon

TS Heavy Rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు

Telangana Hevy Rains

Telangana Hevy Rains

TS Heavy Rain: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుండగా, అనుబంధ వాయుగుండం సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాష్ట్రంలో అల్పస్థాయి గాలులు పశ్చిమం నుంచి వీస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పశ్చిమ దిశ నుంచి అల్పస్థాయి గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. ఈ అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, సనత్ నగర్, బోరబండ, కాప్రా, ఈసీఐఎల్, మల్కాజ్‌గిరి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. అక్కడక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. గురువారం మాత్రమే కాకుండా బుధవారం కూడా నగరంలో ఓ మోస్తరు వర్షం కురిసింది.

రానున్న రెండ్రోజులు పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గురువారం ఉదయం అత్యధికంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్-టి మండలంలో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని కౌటాలలో 10.1 సెం.మీ, చింతలమానేపల్లి 6.5, బెజ్జూరు 5.6, ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ 5.2, కరీంనగర్ జిల్లా వి.సైదాపూర్ 4.2, ములుగు జిల్లా మంగపేట 4, వరంగల్ జిల్లా పర్వతగిరి 3.9, ములుగు జిల్లా వాజేడు 3.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరోవైపు వరంగల్‌లోనూ భారీ వర్షం కురిసింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటతో పాటు అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు ప్రధాన రహదారిపై వరద నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి వద్ద వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మిగిలిన జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న నగరవాసులకు ఆకస్మిక వర్షంతో కాస్త ఊరట లభించింది. అక్టోబర్ నెలలో 6 నుంచి 12వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో దేశంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.