నిజామాబాద్ జిల్లాలో వర్షం కుండపోతగా కురుస్తోంది. మెండోరాలో రికార్డ్ స్థాయిలో 21 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఐదో రోజు కూడా ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. 10 వేల ఎకరాల్లోని పంటలు పూర్తిగా నీటమునిగాయి. జనజీవనం అతలాకుతలం అవ్వడంతో పాటు రాకపోకలు కూడా స్థంభించిపోయాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అంతేకాదు.. కప్పుల వాగు కారణంగా భీంగల్- సిరికొండ మధ్య, అలాగే భీంగల్- మోర్తాడ్, భీంగల్-వేల్పూర్ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచాయి.
అటు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. 2 లక్షల 35 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 1 లక్షా 50 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ ప్రాజెక్ట్ నీటి మట్టం 1091 అడుగులు ఉండగా.. 1087 అడుగులకు నీళ్లు చేరాయి. ఈ ప్రాజెక్ట్ నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. 73 టీఎంసీలు నీళ్లు చేరినట్టు తేలింది. ఇప్పటివరకు అధికారులు 30 వరద గేట్లను ఎత్తేశారు. ఇలా గేట్లు ఎత్తిన నేపథ్యంలో.. జెన్‌కో ఆధ్వర్యంలో విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్ట్ వద్దనున్న జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్లను ఉపయోగిస్తూ.. విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. మూడు యూనిట్ల ద్వారా 25 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ట్రాన్స్‌పోర్ట్ సరఫరా చేస్తున్నారు.