మహబూబ్‌నగర్ నుంచి ఇప్పటికి ఎంతో మంది మంత్రులు వచ్చినా ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. అతి త్వరలోనే రూ. 200 కోట్ల నిధులతో కొత్తగా 900 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. మంగళవారం జిల్లాలోని బాలానగర్‌లో 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు మహబూబ్ నగర్ అభివృద్ధిని ఏనాడో విస్మరించాయన్నారు.
Read Also: ఏ చిన్న లక్షణం కనిపించినా కోవిడ్ పరీక్షలు చేయించుకోండి: మంత్రి అప్పలరాజు
కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సాగు నీటిలోనూ జిల్లాను నెంబర్ వన్ చేశామని అన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాతే.. మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదన్నారు. దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకుల్లోనూ తెలంగాణ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రం అయిన ఉత్తర ప్రదేశ్ చివరి స్థానంలో ఉందన్నారు.
