రైతు చట్టాలను మళ్లీ తీసుకు వస్తామని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రైతు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని.. భేషరుతుగా దేశ రైతాంగానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం, తిరిగి ప్రవేశ పెడతామని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఎవరి మాట నమ్మాలో.. తెలపాలని మంత్రి హరీశ్ రావు సూటిగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఈ దేశ రైతాంగం పై కక్ష్య గట్టిందని, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికల కోసమే వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేశారమోనని అనుమానం వ్యక్తమవుతుందని మంత్రి హరీశ్ వెల్లడించారు. కచ్చితంగా రైతులకు కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని అన్నారు.
