Tragedy : హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన అత్యంత విషాదాంతంగా ముగిసింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో 25 ఏళ్ల సల్మాన్ అనే వ్యక్తి తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్‌పై దారుణంగా దాడి చేశాడు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 104 సమీపంలో బాలుడి తలను పిల్లర్‌కు బలంగా కొట్టడంతో పాటు, పైకి ఎత్తి నేలపై పడేసి రాక్షసత్వం ప్రదర్శించాడు. అంతటితో ఆగకుండా చిన్నారిని వెళ్తున్న లారీ కిందకు నెట్టేందుకు ప్రయత్నించగా, గమనించిన స్థానికులు వెంటనే స్పందించి బాలుడిని రక్షించారు. అనంతరం సల్మాన్‌ను పట్టుకుని స్థానిక గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
తీవ్రంగా గాయపడిన చిన్నారి అర్మాన్‌ను వెంటనే నిలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఆగస్టు 5 నుంచి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్న అర్మాన్, పరిస్థితి విషమించడంతో ఆదివారం (ఆగస్టు 9) ఉదయం సుమారు 11 గంటల సమయంలో ప్రాణాలు విడిచాడు. ఈ విషయాన్ని వైద్యులు బాలుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యుల డిమాండ్
చిన్నారి మృతి చెందడంతో నిందితుడైన సల్మాన్‌ను కఠినంగా శిక్షించాలని అతని సోదరుడు మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. తమ కుటుంబంలో ఎవరూ సల్మాన్‌కు మద్దతుగా నిలవడం లేదని ఆయన స్పష్టం చేశారు. సల్మాన్ తరచూ డ్రగ్స్, నిద్రమాత్రలు, మద్యం సేవిస్తూ ఇంటికి తీవ్ర సమస్యగా మారాడని, పెళ్లి తర్వాత అందరి జీవితాలను నరకంగా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. సల్మాన్‌తో తమకు ఎలాంటి సంబంధమూ లేదని, అతడిని జైలుకు పంపి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీస్ కమిషనర్ , ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘోర ఘటనపై గుడిమల్కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారు.

