Governor Tamilisai Suggestions To Minister Sabitha Indra Reddy: తెలంగాణ యూనివర్శిటీల కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురించి గవర్నర్ తమిళిసై వ్యక్తం చేసిన సందేహాల్ని నివృత్తి చేసేందుకు గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆమెను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ కొన్ని కీలక అంశాలను తెలియజేశారు. బోర్డు ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత అవసరమని అన్నారు. నిష్పాక్షిక పద్ధతిలో వీలైనంత త్వరగా రిక్రూట్‌మెంట్‌ను చేపట్టాలని సూచించారు. అర్హత ఆధారిత రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించాలని కోరారు. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూజీసీ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అభ్యర్థుల సందేహాలను పరిష్కరించాలని చెప్పారు. ఉమ్మడి రిక్రూట్‌మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యలతో పాటు హాస్టల్, లేబొరేటరీ సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే.. రాష్ట్ర విశ్వవిద్యాలయాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడంపై అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
విశ్వవిద్యాలయాల్లో లైబ్రరీ సౌకర్యాలు, డిజిటల్ వనరులను ప్రాధాన్యత ప్రాతిపదికన విద్యార్థుల ప్రయోజనం కోసం మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తమిళిసై అధికారులతో తెలిపారు. విశ్వవిద్యాలయాల సర్వతోముఖాభివృద్ధికి.. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం.. అన్ని విశ్వవిద్యాలయాల్లోని ఛాన్సలర్ కనెక్ట్ కార్యక్రమంతో పూర్వ విద్యార్థినులతో వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొన్నారు. నియామకాలు త్వరగా జరగాలనేదే తన అభిమతమని, న్యాయపరమైన చిక్కులు రాకూడదనేదే తన విధానమని వెల్లడించారు. గవర్నర్ సూచనల్ని విన్న తర్వాత.. తాము నిబంధనలన్నింటినీ పూర్తి స్థాయిలో పాటిస్తున్నామని, ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి సబితా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ప్రస్తుత విధానంలోని ఇబ్బందుల గురించి అధికారులు వివరించారు.
