NTV Telugu Site icon

Ibrahimpatnam Incident: ఇబ్రహీంపట్నం కు.ని. ఘటన.. వారిపై బదిలీ వేటు

Ibrahimpatnam Incident

Ibrahimpatnam Incident

Ibrahimpatnam Incident: ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో గతనెల (ఆగస్టు) 25న జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల (DPL క్యాంపు) ఘటన పై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కఠిన చర్యలకు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్వో, DCHS లపై బదిలీ వేటు వేసింది. వీరితో పాటు మొత్తం 13 మంది వైద్య సిబ్బందిపై క్రమ శిక్షణ చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది.

ఇందులో ఇబ్రహీంపట్నం ఆసుపత్రికి సంబంధించిన DPL క్యాంపు ఆఫీసర్ డాక్టర్ నాగజ్యోతి,డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ గీత, హెడ్ నర్స్ చంద్రకళతో పాటు, మాడుగుల్ PHC డాక్టర్ శ్రీనివాస్, సూపర్ వైజర్లు అలివేలు, మంగమ్మ, మంచాల్ PHC డాక్టర్ కిరణ్, సూపర్ వైజర్ జయలత, దండుమైలారం PHC డాక్టర్ పూనం, సూపర్ వైజర్ జానకమ్మ ఉన్నారు. జిల్లా ఆసుపత్రుల వైద్య సేవల కోర్డినేటర్ (DCHS) ఝాన్సీ లక్ష్మిని బదిలీ చేసిన అరోగ్య శాఖ, షాద్ నగర్ ఆసుపత్రిలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఆమెపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారికి రంగారెడ్డి DCHS గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే సస్పెండ్ అయిన ఇబ్రహీంపట్నం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ పై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ జోయల్ సునీల్ కుమార్ మీద క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఒకవైపు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, మారో వైపు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణ విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. అన్ని టీచింగ్ ఆసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వీటిని పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Read also: Flight on Road: గాల్లో విమానం రోడ్డుమీదకు.. ఏంటా కథ?

మార్గదర్శకాలు:

1. ఆసుపత్రుల సేవల్లో భాగంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలి.
2. కు.ని ఆపరేషన్లు నిర్ణయించిన రోజులో మాత్రమే చేయాలి. ఆపరేషన్ తర్వాత 24 గంటల పాటు విధిగా అబ్జర్వేషన్ లో ఉంచాలి.
3. ముందుగా నిర్ణయించిన క్యాలెండర్ ప్రకారం, ఆపరేషన్ చేసుకునే వారు, వారికి ఇష్టం ఉన్న రోజులో రావొచ్చు.
4. డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళిన పేషెంట్ ని సంబంధిత ఆసుపత్రి సూపర్ వైజర్ 24గంటల్లోగా ఒకసారి, వారంలోగా మారో రెండు సార్లు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి.
5. సంబంధిత పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ కూడా వారి పరిధిలోని ఆపరేషన్ చేసుకున్న వారందరినీ రెండు రోజుల్లోగా వెళ్లి పరిశీలించాలి. పేషెంట్ సంబంధిత సూపర్ వైజర్ పేషెంట్లను మానిటర్ చేస్తున్నారా లేదా మెడికల్ ఆఫీసర్ చూసుకోవాలి.
6. ప్రి ఆపరేటివ్, ఇంట్రా ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్ ప్రమాణాలు పాటించేలా ఆసుపత్రి సూపరింటెండెంట్, సర్జన్, DPL క్యాంపు ఆఫీసర్ చూసుకోవాలి.
7. ఆపరేషన్ల తర్వాత తలెత్తే సమస్యలను గుర్తు పట్టే విధంగా సూపర్ వైజర్లకు ఎప్పటికపుడు శిక్షణ తరగతులు నిర్వహించాలి.
8. ఏడాదికి ఒకసారి డీపీల్ సర్జన్ల నైపుణ్యతను అంచనా వేసే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
9. కమిషనర్ ఆఫీసు లోని రాష్ట్ర స్థాయి జాయింట్ డైరెక్టర్ మూడు నెలలకు ఒకసారి స్టెరిలైజేషన్ మీద కు.నీ నిర్వహణ అధికారులు, సర్జన్లు, ఇతర సిబ్బందితో సమీక్ష జరుపాలి.
10. నాణ్యత ప్రమాణాలను అనుసరించి ఒకరోజు ఒక ఆసుపత్రిలో 30కి మించి ఆపరేషన్లు చేయరాదు.
11. ఆయా ఆసుపత్రుల్లో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీ ఛైర్మెన్ గా ఉన్న సూపరింటెండెంట్లు ప్రతి సోమవారం ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ మీద సమీక్ష చేయాలి.
12. బోధన ఆసుపత్రులు, టీవీవీపీ ఆసుపత్రుల్లోని ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్లు, నర్సులకు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నూతన పద్ధతులపై ఎప్పటికప్పుడు నిమ్స్ ఆసుపత్రిలో శిక్షణ ఇవ్వాలి.
13. ఇన్ఫెక్షన్ నివారణ ప్రమాణాలు పాటించే విధంగా DME, TVVP కమిషనర్ చూసుకోవాలి, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూల్లో ప్రత్యేక దృష్టి సారించాలి.

Flight on Road: గాల్లో విమానం రోడ్డుమీదకు.. ఏంటా కథ?