NTV Telugu Site icon

Ghattamaneni Indira Devi is No More: మహేష్‌ బాబు ఇంట విషాదం.. ఘట్టమనేని ఇందిరా దేవి కన్నుమూత

Indira Devi

Indira Devi

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ, హీరో మహేష్‌ బాబు ఇంట విషాదం నెలకొంది… హీరో మహేష్ బాబుకి మాతృ వియోగం కలిగింది.. అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న సూపర్‌ స్టార్‌ కృష్ణ భార్య, మహేష్‌ బాబు తల్లి ఇందిరా దేవి ఇవాళ కన్నుమూశారు.. దాదాపు నెల రోజుల నుండి అనారోగ్య సమస్యలతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇందిరా దేవి ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు ప్రాణాలు విడిచారు… ఈ రోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కుటుంబ సభ్యులు..

1961లో సూపర్‌ స్టార్‌ కృష్ణ.. ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు.. వారికి ఐదుగురు సంతానం.. రమేష్‌బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఇప్పటికే కరోనా సమయంలో ఆమె కుమారుడు రమేష్‌ బాబు కన్నుమూశాడు.. మరోవైపు.. కృష్ణ 1969లో విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మల కూడా 2019లో ప్రాణాలు విడిచారు.. ఇలా వరుస మరణాలు ఘట్టమనేని కుటుంబంలో విషాదాన్ని నింపాయి..

కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరా దేవితో వివాహం జరిగింది.. 1965 అక్టోబర్ 13 నాటికి పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టాడు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాల్లో పనిచేసి, ఆ తర్వాత సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నారు.. ఆ తర్వాత కరోనా సమయంలో కన్నుమూశారు.. ఇక, వీరి మరో కుమారుడు మహేష్‌బాబు టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌గా కొనసాగుతున్నారు. కృష్ణ కుటుంబం నుంచి కుమార్తె మంజుల నటన, నిర్మాణం, దర్శకత్వం చేస్తుంది. చిన్న అల్లుడు సుధీర్ బాబు హీరోగా పేరుతెచ్చుకుంటున్నాడు. మరో అల్లుడు గల్లా జయదేవ్ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నారు..