Galla Satyanarayana Sensational Comments On CPM: సీపీఎం ఎవరితో అయితే పొత్తు పెట్టుకుంటుందో.. ఆ పార్టీలన్నీ పత్తా లేకుండా పోయాయని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సీపీఎం మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించిందని, ఇతర పార్టీల తరహాలోనే టీఆర్ఎస్ కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. బీజేపీపై మతతత్వ పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారని.. తెల్దారు పిల్లలో మాత్రం వేరే పార్టీ జెండా ఎత్తితే హత్యలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. తెల్దారు పల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగిందని, జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని తాము కోరుకుంటున్నామన్నారు.
సొంత గ్రామంలో వస్తున్న ఆరోపణలపై తమ్మినేని వీరభద్రం సమాధానం చెప్పాలని గల్లా సత్యనారాయణ డిమాండ్ చేశారు. కృష్ణయ్య హత్య కేసులో లేని వారు ఎందుకు పారిపోయారని, గ్రామంలో ఎందుకు దండయాత్ర చేశారని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 10వ తేదీన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లాకు వస్తారని, కృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని అన్నారు. మా పార్టీ నేత హత్య జరిగితే.. ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఎందుకు మాట్లాడటం లేదని అడిగారు. తమ్మినేని కృష్ణయ్య కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని, వారికి తక్షణమే రక్షణ కల్పించాల్సిందేనని గల్లా సత్యనారాయణ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరేసిన తర్వాత కృష్ణయ్య తిరుగు పయనం అయినప్పుడు, దారిలో కొందరు దుండగులు అడ్డగించి తమ్మినేని కృష్ణయ్యను హత్య చేసిన సంగతి తెలిసిందే! తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఆయన పరుగులు తీయగా, వెంబడించి మరీ పొలాల్లో ఆయన్ను పొడిచి చంపేశారు. వ్యక్తిగత కక్షలు, ఇతర కారణాలతోనే కృష్ణయ్య హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.