Gaddar Controversial Comments On Raithu Bandhu And Voting: విప్లవ గాయకుడు గద్దర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోరుట్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని చక్కదిద్దాలంటే, ఓటుని పొలిటికల్ డెత్‌గా మార్చాల్సిందిగా బాంబ్ పేల్చారు. ఫ్యాక్టరీలు పెట్టినప్పుడు రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేసిన ఆయన.. ఫ్యాక్టరీలు బంద్ అయ్యాక తమ భూములు వెనక్కు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేయాలన్నారు. ఒకవేళ భూములు వెనక్కు ఇవ్వకపోతే.. భూములు అమ్మిన తర్వాత వచ్చే మొత్తంలో నుంచి షేర్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. రైతులు రాజకీయ శక్తిగా మారితే.. మొత్తం మారిపోతుందని సూచించారు. ధరణి వచ్చిన తర్వాత దొరల భూములు అలాగే ఉన్నాయని.. రైతుల భూములే గల్లంతయ్యాయని పేర్కొన్నారు. నక్సలైట్లు జెండాలు పాతినా.. రిజిస్ట్రేషన్ కాలేదన్నారు. అమెరికాలో ఉన్న వారికి కూడా రైతు బంధు వచ్చిందని అన్నారు. తెలంగాణ రాకముందు.. ఫ్యాక్టరీలు తెరవాలని పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తాను పాటలు పాడానన్నారు. అయితే, ఇప్పుడు ఎక్కడికి వెళ్లావు? అంటూ తనని ప్రశ్నిస్తున్నారని గద్దర్ చెప్పారు.
కాగా.. ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చిన గద్దర్, తొలిసారి తన ఓటు హక్కును 2018 తెలంగాణ ఎన్నికల్లో వినియోగించుకున్నారు. మరెన్నో నిర్ణయాలతో ఆశ్చర్యపరిచన ఆయన, ఈమధ్య తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ అవుతున్నారు. కొంతకాలం క్రితమే ఆయన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కలవడం సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. అప్పుడు ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారనే చర్చ జోరందుకుంది. కట్ చేస్తే.. ఆ తర్వాత ఆయన గాంధీ భవన్లో కనిపించారు. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే.. ఈ రెండు భేటీల్లోనూ ఆయన కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. అంటే, రాజకీయాల్లోకి రావడం లేదని స్పష్టం చేసుకోవచ్చు.
