NTV Telugu Site icon

Koppula Harishwar Reddy: మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల మృతి.. సీఎం కేసీఆర్‌ సంతాపం

Koppula Harishwar Reddy

Koppula Harishwar Reddy

Koppula Harishwar Reddy: బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరీశ్వర్ రెడ్డి శుక్రవారం రాత్రి 10.10 గంటలకు గుండెపోటు రావడంతో వెంటనే పట్టణంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు పరిగిలో హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి. హరీశ్వర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్ రెడ్డి ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు.

హరీశ్వర్ రెడ్డి 1985, 1994, 1999, 2004, 2009 ఎన్నికల్లో పరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వార్డు మెంబర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హరీశ్వర్ రెడ్డి 1978లో పరిగి ఉప సర్పంచ్‌గా, 1978లో సర్పంచ్‌గా, సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. టీడీపీలో ఉన్నప్పటి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో సత్సంబంధాలు కలిగి ఉన్న హరీశ్వర్ రెడ్డి.. రాష్ట్ర విభజన అనంతరం సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో 2014లో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతికి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. పరిగి నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రముఖ నేత హరీశ్వర్ రెడ్డి అని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి తనయుడు, ప్రస్తుత పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి అకాల మరణం పట్ల తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. కొప్పుల హరీశ్వర్ రెడ్డితో పనిచేసినప్పుడు ఆయనకు ఉన్న అనుబంధాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.
Mangalasutra: మంగళ సూత్రంను ఇలా వేసుకుంటున్నారా? మీకు ఆ కష్టాలు తప్పవు..