NTV Telugu Site icon

Children Drown: ఫంక్షన్‌లో విషాదం.. ఈతకు వెళ్లి ఆరుగురు దుర్మరణం

Children Drowned

Children Drowned

Five Children And A Man Drown In Medchal Malkaram Lake: తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌లో విషాదం చోటు చేసుకుంది. జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కారం చెరువులో ఈత కొట్టేందుకు ఆరుగురు చిన్నారులు వెళ్లగా.. వారిలో ఐదుమంది మృతి చెందారు. వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ ఆటో డ్రైవర్ సైతం చెరువులో మునిగి మరణించాడు. జవహర్‌నగర్‌లోని ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు ఒక కుటుంబం హాజరయ్యింది. ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలు.. పక్కనే ఉన్న చెరువు కనబడగానే, సరదాగా ఆడుకుందామని వెళ్లారు. అయితే.. ఈత రాకపోవడంతో ఐదుగురు పిల్లలు దుర్మరణం చెందారు. వీరికి కాపాడేందుకు అదే కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ చెరువులో దూకగా.. ఆయన కూడా మృతి చెందాడు. ఒక అబ్బాయిని మాత్రం స్థానికులు కాపాడారు.

మృతి చెందిన పిల్లల వయసు 10 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను చెరువులో నుంచి బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే.. క్షేమంగా బయటపడ్డ అబ్బాయిని, చికిత్సం నిమిత్తం దగ్గరలోనే ఆసుపత్రికి చేర్పించారు. మృతి చెందిన వారంతా.. అంబర్‌పేట్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఏసీపీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు విగతజీవులుగా తిరిగి రావడంతో.. వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భవిష్యత్తులో తమకు ఆసరాగా ఉంటారనుకున్న పిల్లలు ఇప్పుడు లేరన్న విషయం తెలిసి రోదిస్తున్నారు.