Fire in Telangana New Secretariat: ప్రారంభానికి సిద్ధమవుతున్న తెలంగాణ సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయంలో మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సెక్రటేరియట్ చుట్టుపక్కల రోడ్లు బ్లాక్ చేసినారు ఎవర్ని రానివ్వటం లేదు. అయితే.. ఎలాంటి నష్టం జరగలేదు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా.. సచివాలయంలో వుడ్ వర్క్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు పోలీసులు భావిస్తున్నారు. సచివాలయం ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ అగ్నిప్రమాదం జరగడంతో ప్రమాదానికి గల కారణాలపై అధికారులు తెలుసుకుంటున్నారు.
Read also: Crime News: తల్లిని తిట్టాడని తమ్ముడిని కత్తితో పొడిచిన అన్న
తెలంగాణ నూతన సచివాలయాన్ని ఈ నెల 17న ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టినరోజు. కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరుకానున్నారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజా పోరాట యోధుడు గద్దర్ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు తెలంగాణ సచివాలయానికి ప్రభుత్వం అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసింది.