NTV Telugu Site icon

TS Assembly Sessions: అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్‌.. ఈసారి హరీష్‌ లెక్క ఎంతంటే?

Harish Rao

Harish Rao

TS Assembly Sessions: ఇవాళ అసెంబ్లీలో 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీలో ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇక శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్న క్రమంలో ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయాన్ని హరీష్ రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం అసెంబ్లీకి చేరుకుని బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటాయింపులపై చర్చ జరగనుంది. ఈ ఏడాది 12వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశముంది. అయితే.. ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, ముందస్తు ఎన్నికలు రావొచ్చనే సంకేతాల నేపథ్యంలో ఎన్నికల ఏడాదిలో తెలంగాణ బడ్జెట్ ఎలా ఉంటుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకానికి భారీగా కేటాయింపులు ఉండే అవకాశముందని తెలుస్తోంది. అలాగే మిగతా సంక్షేమ పథకాలను కూడా భారీగా నిధుల కేటాయింపు ఉండనుందని తెలుస్తోంది. అయితే.. నిరుద్యోగులకు రూ.3016 భృతి ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పొందుపర్చింది.

Read also: Telangana Budget 2023 Live Updates: తెలంగాణ బడ్జెట్ 2023 లైవ్ అప్ డేట్స్

సీఎం కేసీఆర్ రెండో దఫా పాలనకు నాలుగేళ్లు పూర్తై, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తుండగా ఇప్పటివరకు నిరుద్యోగ భృతి హామీని ప్రభుత్వం అమలు చేయలేదు. ఇక, నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో కేసీఆర్ హామీ ఇచ్చి దానిని అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారనే విమర్శలు ప్రతిపక్ష, విపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య భారీగా ఉందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోన్నాయి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే యువత ఓట్లు కీలకం. ఈనేపథ్యంలో.. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించి ఆ హామీని ప్రభుత్వం నెరవేరుస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్ష ఇస్తామని గత ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ హామీ అమలు కాలేదు. సీఎం కేసీఆర్ గతంలో అనేకసార్లు ప్రకటనలు చేసినా ఇప్పటివరకు ఆ పథకానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఇవాళ ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆ పథకానికి నిధులు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. అంతేకాకుండా.. వైద్య రంగానికి భారీగా కేటాయింపులు ఉంటాయని చెబుతున్నారు.
Monday Shiva Stothra parayanam Live: సోమవారం నాడు ఈ స్తోత్రపారాయణం చేస్తే..

Show comments