తెలంగాణలో రేపటి నుండి రైతు రుణమాఫీ ప్రారంభం కానుంది. రూ.2005.85 కోట్ల రుణమాఫీ చేయనున్నారు. దీని ద్వారా రూ.50 వేల వరకు రుణాలున్న 6,06,811 మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. అయితే నేడు రుణమాఫీపై ట్రయల్ రన్ చేస్తున్నారు. రూ.25 వేల పైబడి రూ.25,100 వరకు రుణం ఉన్న రైతుల రుణమాఫీపై ట్రయల్ చేస్తున్నారు. ఈ నెల 30 వరకు రూ.25 వేల నుండి రూ.50 వేల వరకు రుణాలున్న రైతుల రుణాలు మాఫీ కానున్నాయి.
అయితే రైతుబంధు మాదిరిగా కుంట నుండి ఎకరా వరకు, ఎకరా నుండి 2 ఎకరాలు, 2 నుండి 3 ఎకరాల రైతుల ఖాతాలలో నిధులు జమ చేసిన మాదిరిగా రూ.25 వేలు, రూ.26 వేలు, రూ.27 వేలు చొప్పున రుణమాఫీ రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. రైతుబంధు తరహాలో వందశాతం విజయవంతంగా పంట రుణమాఫీ కానుంది. ఆన్ లైన్ ద్వారా అమలుచేసేందుకు ట్రయల్ రన్ చేస్తున్నారు. 2014 నుండి 2018 వరకు రూ16,144.10 కోట్ల రైతుల రుణాలు మాఫీ అయ్యింది. 2018లో రూ.25 వేల లోపు 2.96 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్లు మాఫీ చేసింది ప్రభుత్వం.
