భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా టీఆర్ఎస్ వర్గీయుల మధ్య వివాదం చినికిచినికి గాలి వానలాగా మారుతోంది. పోలీసు అధికారులు అత్యుత్సహం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అశ్వాపురం మండలం మల్లెల మడుగులో పొంగులేటి అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుపకుండా గ్రామంలో 144 సెక్షన్ విదించారు. ఈ సందర్బంగా పోలీసులతో ,రేగా వర్గీయులతో పొంగులేటి వర్గానికి మద్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడిలో పొంగులేటి వర్గీయులు గాయపడ్డారు. అయితే పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటుగా మాజీ ఎంఎల్ఎ పాయం వెంకటేశ్వర రావు, మాజీ ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య ల మీద అశ్వాపురం పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల పై మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పోలీసులపై ఫైర్ అవుతున్నారు. ఈ వ్యవహారంలో పోలీసుల అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ పద్దతుల్లో వ్యవహరించకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. తాను టీఆర్ఎస్ లోనే ఉన్నానని, తనపై కేసులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్న వారు ఆలోచించుకోవాలని అన్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఎవ్వరైనా చేయవచ్చునని అన్నారు. ప్రధానంగా తనమీద, తన అనుచరులుగా ఉన్నవారి మీద కేసులు పెడుతున్నారని ఆ కేసులను ఎదుర్కోవడం తమకేమి కొత్తకాదని అన్నారు. పోలీసు అధికారులు చట్టపరంగా వ్యవహరించాలి కాని, వ్యక్తి గత కక్ష్యలతో, కొంతమంది ప్రజా ప్రతినిధుల వత్తిడికి లొంగిపోవడం సరికాదని, వారిపై చట్ట రీత్యానే తాము పోరాటం సాగిస్తామని పొంగులేటి అంటున్నారు.