Site icon NTV Telugu

KTR Tweet: పదేళ్ల రాష్ట్ర సంపదపై ‘స్వేద పత్రం’.. కాంగ్రెస్ శ్వేత పత్రానికి కేటీఆర్ కౌంటర్..!

Ktr 11

Ktr 11

కాంగ్రెస్ శ్వేత పత్రానికి కౌంటర్‌‌గా మాజీ మంత్రి కేటీఆర్ స్వేద పత్రం ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. కాగా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం 42 పేజీల శ్వేత పత్రాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక దీనికి కౌంటర్‌గా తాజాగా కేటీఆర్ స్వేద పత్రాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా తెలంగాణ స్వేదపత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ‘తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం. పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు స్వేద పత్రం పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం’ అని తెలిపారు.

Exit mobile version