Site icon NTV Telugu

Etela Rajender: పక్కా ప్లాన్‌తోనే దాడి.. మునుగోడు తీర్పుతో చెంప ఛెళ్లుమనడం ఖాయం

Etela Rajender

Etela Rajender

Etela Rajender Reacts On Palivela Attack Incident: పలివెలలో తన కాన్వాయ్‌పై జరిగిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. గెలవరు అనే భయంతోనే టీఆర్ఎస్ వాళ్లు తమపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ సమక్షంలోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. మునుగోడు ప్రజల తీర్పుతో టీఆర్ఎస్ చెంప ఛెళ్లుమనడం ఖాయమని జోస్యం చెప్పారు. పలివెల గ్రామంలో టీఆర్ఎస్‌కు బేస్ కూడా లేదని, పోలీసులను సైతం లెక్క చేయకుండా ఇలా దాడులకి దిగడం దారుణమని మండిపడ్డారు. తమను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకపోవడం వల్లే.. ఇలా భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు.

టీఆర్ఎస్‌కు ఇలాంటి చిల్లర వేషాలు, చిల్లర దాడులు చేయడం కొత్తేమీ కాదని ఈటెల రాజేందర్ చెప్పారు. గతంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించిన సమయంలో కూడా ఇలాగే వ్యవహరించారని గుర్తు చేశారు. పలివేలలో జరిగిన రాళ్ల దాడిలో దాదాపు 15 ప్రచార రథాలు, వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. కేసీఆర్ గుండాయిజానికి తాము భయపడమని, పక్కా ప్లాన్‌తోనే తమపై దాడి చేశారని పేర్కొన్నారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా.. ప్రచారం ముగియడానికి ఇంకొన్ని గంటలే ఉందనగా, పలివెల గ్రామంలో ఈటెల కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. బీజేపీ శ్రేణులు కూడా ఎదురుదాడికి దిగడంతో.. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో గాయపడిన బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణుల్ని సమీప ఆసుపత్రులకు తరలించి.. చికిత్స అందించారు.

అంతకుముందు ఈ దాడికి బండి సంజయ్ కూడా ఖండిస్తూ.. టీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పైసలతో గుండాయిజం చేస్తున్నారని, బీజేపీ కార్యకర్తలను తక్కువ అంచనా వేయొద్దని సూచించారు. ధర్మం కోసం బీజేపీ కార్యకర్తలు పని చేస్తారని, తమ సహనాన్ని పిరికితనంగా భావించొద్దని హెచ్చరించారు. ఏ అలజడి జరిగినా.. దానికి జిల్లా పోలీసులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేదంటే.. మీ ఉద్యోగాలుండవని, సీఎం కూడా మిమ్మల్ని కాపాడలేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Exit mobile version