Site icon NTV Telugu

Etela Rajender: తెలంగాణతో కేసీఆర్‌కు సంబంధం తెగిపోయింది

Etela Rajender

Etela Rajender

Etela Rajender Fires On CM KCR After BRS Party Announcement: అక్టోబర్ 5వ తేదీన విజయదశమి సందర్భంగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ బీఆర్ఎస్ పట్ల టీఆర్ఎస్ శ్రేణులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ.. విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్.. సీఎం కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపనతో.. కేసీఆర్‌కు తెలంగాణతో సంబంధం తెగిపోయిందని, టీఆర్ఎస్‌తో తెలంగాణ ప్రజానీకానికి ఉన్న అనుబంధం ముగిసిపోయిందని చెప్పారు. తెలంగాణ సాధన కోసం వచ్చిన ఉద్యమ పార్టీని కేసీఆర్ ఖతం చేశారని మండిపడ్డారు. ఉద్యమ పార్టీని మట్టిలో కలిపేసి, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన ఉద్యమకారుల్ని సైతం మర్చిపోయేలా చేసి.. కేవలం తన ముద్ర మాత్రమే ఉండేలా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించారని ఆయన విమర్శించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో.. దేశంలో రాజకీయాలను నడపాలని కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుందని దుయ్యబట్టారు. కూట్లో రాయి తీయలేనోడు.. ఏట్లో రాయి తీయడానికి పోయినట్టు కేసీఆర్ తీరు ఉందని ఈటెల రాజేందర్ ఎద్దేవా చేశారు.

అటు.. బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ కూడా కేసీఆర్ జాతీయ పార్టీ మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు నూకలు చెల్లిపోవడంతో.. ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ మరో కొత్త డ్రామాకి తెరలేపారని విమర్శించారు. తన ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు ఏమీ చేయని కేసీఆర్.. తెలంగాణ బంగారుమయమైందంటూ జాతీయ పత్రికలు, టీవీలకు తప్పుడు ప్రచారం చేస్తూ.. దేశ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాల్జేసి.. యావత్ రాష్ట్రాన్ని బ్యాంకులకు, కార్పొరేషన్లకు కేసీఆర్ కుదువ పెట్టారని వ్యాఖ్యానించారు.

Exit mobile version