Site icon NTV Telugu

Etela Rajender: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు.. అదే కూలిపోతుంది

Etela On Cm Kcr

Etela On Cm Kcr

Etela Rajender Comments On TRS Government And CM KCR: తెలంగాణలో ఇప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాము కష్టపడాల్సిన అవసరం లేదని, దానికదే కూలిపోతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు, సీఎం కేసీఆర్‌కు మధ్య ఆత్మీయ బంధం లేదని.. కేవలం అవసరాల సంబంధం మాత్రమే ఉందన్నారు. ఇది అపనమ్మకంతో పరస్పర అవసరాల కోసం ఏర్పడిన ప్రభుత్వమని అన్నారు. సొంత పార్టీ వారినే పార్టీలో చేరుతున్నట్టు మళ్లీ కండువాలు కప్పుతున్నారని.. సొంత పార్టీ ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని కొనుక్కోవడం సిగ్గుచేటని విమర్శించారు.

ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యిందని, అది చతికిల పడిందని, ఇప్పుడప్పుడే లేచే పరిస్థితి ఆ పార్టీకి లేదని ఈటెల రాజేందర్ చెప్పారు. 21వ తేదీన మీటింగ్ పెట్టుకుంటామని, అమిత్ షా కూడా వస్తారని ముందే తాము ప్రకటించామని.. కానీ గిల్లికజ్జాలు పెట్టుకున్నట్టు ఒక రోజు ముందు సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 2014 వరకు తెలంగాణ గాంధీగా పిలవబడ్డ కేసీఆర్.. 8 ఏళ్ల పాలనలో తెలంగాణ ద్రోహిగా ఎందుకు పిలవబడుతున్నారో వారే తెలుసుకోవాలని సూచించారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా, ఎలాంటి ఎత్తుగడలు వేసుకున్నా.. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version