NTV Telugu Site icon

Errabelli Dayakar Rao : 70 ఏళ్లలో చేసిందేమీ లేదు.. అన్ని బూటకపు హామీలే..

మహబూబాబాద్‌లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే మెడికల్ కళాశాలను, నూతన హాస్పిటల్‌కు నిర్మాణం చేపట్టడం జరుగుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ వెల్లడించారు. మంగళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తూ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే.. హరీష్‌రావు వెంట మంత్రి ఎర్రబెల్లి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాళేశ్వరం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతామంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోలేదని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మొదట ప్రవేశపెట్టి తెలంగాణలో హామీలు ఇవ్వాలని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బూటకపు హామీలను ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. 70 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డ ఎర్రబెల్లి.. మహబూబాబాద్ ను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.