Site icon NTV Telugu

Satvik Suicide Case: శ్రీ చైతన్య కాలేజీపై ఎంక్వైరీ రిపోర్టు.. సాత్విక్ ఘటనలో ప్రభుత్వానికి నివేదిక

Satvik Suicide Case

Satvik Suicide Case

Satvik Suicide Case: హైదరాబాద్‌ శివారు నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్‌పై వేధింపులు నిజమేనని ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధారించింది. శ్రీచైతన్య కాలేజీపై విచారణ జరిపి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందజేసింది. గత నెల 28వ తేదీన నార్సింగి శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ ఐదు రోజుల పాటు విచారణ నిర్వహించింది. ఈ కమిటీ ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది.

శ్రీచైతన్య కళాశాలలో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఈ కమిటీ తేల్చి చెప్పింది. వేరే కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ ఉన్న విషయాన్ని కమిటీ గుర్తించింది. వేరే కాలేజీలో ఆడ్మిషన్ ఉన్నా కూడా నార్సింగి కాలేజీలో సాత్విక్ చదువుతున్న విషయాన్ని నివేదికలో కమిటీ ప్రస్తావించింది. ర్యాగింగ్‌ లాంటి వాటిపైన ఇంకా విచారణ చేయాల్సి ఉందని కమిటీ తెలిపింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇదే రకమైన పరిస్థితి ఉందని కమిటీ అభిప్రాయపడింది. శ్రీ చైతన్య కాలేజీలో క్లాసులు నిర్వహిస్తున్న విషయాన్ని కమిటీ పేర్కొంది. కానీ విద్యార్ధులకు సర్టిఫికెట్లను చిన్న కాలేజీల పేరుతో జారీ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. విద్యార్ధుల అడ్మిషన్లపై చెక్ చేయాలని కమిటీ ప్రభుత్వానికి సూచించింది.

Read Also: Tirupati Extramarital Affair: భార్య ఎఫైర్.. భర్తకు శిరోముండనం చేసిన నిందితులు అరెస్ట్

శ్రీచైతన్ కాలేజీలో సాత్విక్ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. కాలేజీకి చెందిన కృష్ణారెడ్డి, రవి, ఆచార్య , నవీన్ వంటి వారు వేధింపులకు పాల్పడినట్టుగా సాత్విక్ సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ఆధారంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నలుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. సాత్విక్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version