చిన్నపాటి నిర్లక్ష్యం ఒక్కోసారి జీవితాలను తలకిందులు చేస్తుంది. ఇంజనీర్ల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో చోటు చేసుకుంది. పాల్వంచ కేటిపిఎస్ 5వ దశ లోని 10వ యూనిట్ లో సాంకేతిక లోపం ఏర్పడటంతో యూనిట్ ట్రిప్ చేసి మరమ్మతులు చేయవలసి ఉండగా ఇంజనీర్ల పర్యవేక్షణ లోపం ,తొందరపాటు చర్య వల్ల ఘోరం జరిగింది. ఆర్టిజన్ వలీ పాషా (28)కార్మికుడు ఈ ప్రమాదంలో మృతి చెందాడు.
Read Also: CM KCR: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
యూనిట్ ట్రిప్ అయిన తర్వాత మరమ్మతులు చేయవలసి ఉండగా బాయిలర్ ఇంజనీర్లు ట్రిప్ అయిన విషయాన్ని నిర్ధారించుకోకుండానే బాయిలర్ లోని ఎయిర్ ప్రీ హీటర్ వద్ద మాన్యువల్ డోర్ తెరిపించడంతో ఒకసారిగా వేడి గాలిదాటికి మాన్యువల్ డోర్ తీవ్రంగా వేగంగా ఛాతీ పై తగలటంతో రెండవ అంతస్తు నుంచి కిందపడి వలీ పాషా అనే ఆర్టిజన్ కార్మికుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మృతికి గల కారణం ఇంజనీర్ల నిర్లక్ష్యం,అత్యుత్సాహం వల్ల ఒక నిండు ప్రాణం బలి అయిందని తోటి కార్మికులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
మృతి చెందిన గ్రేడ్ టూ ఆర్టిజన్ ఎస్.కె.వలీ పాషా కు వివాహం అయి భార్య, నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాద ఘటనతో వలీ పాషా కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి చెందిన కుటుంబానికి జెన్కో యాజమాన్యం న్యాయం చేయాలని,నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తోటి కార్మికులు. కేటీపీఎస్ కాంప్లెక్స్ లో ఈ రెండు నెలల్లో అధికారుల నిర్లక్ష్యానికి మృతి చెందిన ఘటన లో ఇది రెండవది. ఈ ప్రమాదాలలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also: Manish Sisodia: నా బ్యాంకు లాకర్లలో సీబీఐకి ఏం దొరకలేదు.. అయినా నన్ను అరెస్ట్ చేస్తారు.