దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్న వేళ అందరూ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనిచ్చేలా కనిపిస్తోంది. అయితే తాజాగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా త్వరలో ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే శనివారం బస్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉన్నతాధికారుల కీలక సమావేశం జరిగింది. 9 ఏళ్ల తరువాత ఆర్టీసీ బోర్డ్ తొలిసారి భేటీ కావడం విశేషం.
ఈ సమావేశం అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. డీజిల్ ధరలు పెరగడం ద్వారా ఆర్టీసీకి వాటిల్లిన నష్టం, కోవిడ్ సమయంలో సిబ్బంది సేవలను బోర్డ్ అభినందించిందన్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ ఆమోదం పొందిందని వెల్లడించారు. 9 ఏళ్ల తర్వాత బోర్డ్ మీటింగ్ జరిగిందన్నారు. 1,060 కొత్త బస్సులను కొనాలని టెండర్ వేశామని ఆయన వెల్లడించారు. ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్‌లో తీసుకువస్తామని సజ్జనార్ స్పష్టం చేశారు.
