DSC 2008 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2008 (DSC 2008) ఉద్యోగాల నియామకాల ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ జీవో నెంబర్ 28ను సవరించిన తీరును తప్పుబడుతూ దాఖలైన మూడు వేర్వేరు రిట్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత జీవో నెంబర్ 28ను జారీ చేసి రూల్ 7కు ప్రొవిజన్ చేర్చడం సరికాదని, 2008 డిసెంబర్ నాటి అసలైన నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతూ బీఈడీ (B.Ed) అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం పిటిషనర్ల అభ్యర్థనలను తోసిపుచ్చింది.
నిబంధనల సవరణపై న్యాయస్థానం స్పష్టత..
డీఎస్సీ-2008 నియామక ప్రక్రియ , ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ హైకోర్టు ఈ తీర్పును వెలువరించింది. నియామక నిబంధనలలో ప్రభుత్వం చేపట్టిన మార్పులు , జీవో సవరణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై సమగ్ర విచారణ చేపట్టిన ధర్మాసనం, పిటిషన్లలో తగిన బలం లేదని తేల్చింది. ఈ తీర్పు వెలువడటంతో సంబంధిత అధికారులకు , నియామక ప్రక్రియకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు స్పష్టత వచ్చినట్లయింది.

