అసలే మందు తాగారు. ఏం చేస్తున్నారో తెలీని పరిస్థితి. మందు తలకెక్కితే విచక్షణ మరిచిపోతారు. హైదరాబాద్ లో మందుబాబులు తమ ప్రతాపం చూపారు..హైదరాబాద్‌లో మందుబాబులు చేసిన పనిపై పోలీసులు మండిపడుతున్నారు. పీకలదాకా తాగి.. కారుతో సీపీ కార్యాలయం గేటునే ఢీకొట్టారు. పీకలదాకా తాగి.. కారులో రయ్‌రయ్‌మంటూ షికారు చేశారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశారు.
మత్తులో తేలిపోతున్న మందుబాబు కారును కూడా గాల్లోకి పోనిచ్చాడు. ఇంకేముంది.. మూసుకుపోతున్న కళ్లకు ముందు ఏముందో కనపడక ఓ గేటును ఢీకొట్టేశాడు. తీరా.. మత్తు నుంచి తేరుకుని కారు దిగి చూస్తే.. ఆ గేటు ఎవరిదో కాదు.. బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయానిది. కారు ఢీకొని సీపీ కార్యాలయం గేటు స్వల్పంగా ధ్వంసమైంది. మందుబాబులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సినిమాల్లో జరిగినట్టు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో ఇలాంటివి మామూలుగా జరిగిపోతున్నాయి. అర్థరాత్రిళ్ళు వరకూ బార్లు, పబ్ లు నడిస్తే యువత ఎలా తయారవుతారో ఈ సంఘటనే ఉదాహరణ.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టినా.. యువత వాటిని పట్టించుకోవడం లేదు. లైట్ తీసుకుంటున్నారు. పోలీసులకు దొరికితే ఫైన్ కట్టి బయటపడుతున్నారు. లేకుంటే ఎంజాయ్ చేస్తున్నారు. నగరంలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుంటే… యువత వేగానికి బ్రేకులు లేకుండా పోతున్నాయి.
