Site icon NTV Telugu

Drive in Theatre: సినిమా ప్రియులకు పండగే.. ఇకపై కార్లలో కూర్చొనే సినిమా చూడొచ్చు

Drive In Theatre

Drive In Theatre

Drive in Theatre: సినిమా ప్రియులకు పండగ అనే చెప్పాలి. ఎంచక్కా సొంత కార్లను లోపలి వరకూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి అక్కడుండే పెద్ద స్క్రీన్ మీద సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అక్కడే లభించే కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకొని కారు సీట్‌లోనే కూర్చొని పెద్ద తెరపై సినిమాను ఆస్వాదించవచ్చు. ఇది ఎక్కడో కదండోయ్‌ హైదరాబాద్‌ లోనే. నగరంలో మరో వినోద కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది. భాగ్యనగర వాసులకు కనువిందు చేయనుంది. ఇప్పటిదాకా ఇతర నగరాలకే పరిమితం అయిన డ్రైవ్ – ఇన్ ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇక హైదరాబాద్‌లో కూడా కొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దీంతో ఇకపై సినిమాకు వెళ్లడంలో కొత్త అర్థం రానుంది. ఈ డ్రైవ్ – ఇన్ థియేటర్ రాకతో సినిమా ప్రియులకు ఇక పండగవాతవరణమే..

ఎక్కడ అంటే..

హైదరాబాద్‌లో తొలి డ్రైవ్ ఇన్ థియేటర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఏర్పాటు కానుంది. ఇది భారతదేశంలోనే మొదటి ఎయిర్‌పోర్ట్ డ్రైవ్-ఇన్ థియేటర్. స్టార్లిట్ సినిమాస్ వంటి సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో డ్రైవ్-ఇన్ థియేటర్లను నడుపుతున్నప్పటికీ, ఇది రెగ్యులర్‌గా అందుబాటులో లేదు. కానీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్వరలో ప్రారంభించనున్న డ్రైవ్-ఇన్ థియేటర్‌ను శాశ్వత ప్రాతిపదికను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌జిఐ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన శాశ్వత డ్రైవ్-ఇన్ ఓపెన్ థియేటర్‌తో నగరవాసులు సినిమాకు వెళ్లడంతో కొత్త అనుభూతిని కలిగిస్తుంది. విమానాశ్రయం చుట్టుపక్కల అందమైన ప్రదేశాల్లో, ప్రశాంత వాతావరణంలో సినిమా చూసే ఆహ్లాదకరమైన అనుభూతిని ప్రేక్షకులు పొందనున్నారు. అంతేకాదండోయ్‌ ఆక్వా గోల్ఫ్ కోర్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు.

ఆక్వా గోల్ఫ్ కోర్స్ అంటే..?

శాశ్వత ఓపెన్ ఎయిర్ థియేటర్‌తో పాటు ఆక్వా గోల్ఫ్ కోర్సును కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆక్వా గోల్ఫ్ కోర్స్ అంటే.. నీటిలో గోల్ఫ్ ఆడడం. సాధారణ గోల్ఫ్ కోర్సులు ఆకుపచ్చ ఫ్లోరింగ్ కలిగి ఉంటాయి. ఆక్వా గోల్ఫ్ అనేది ఒక కొలనులో ఏకకాలంలో ఆడే గోల్ఫ్. బంతులు నీటిపై తేలుతాయి. నీటిలో ఏర్పాటు చేసిన గోల్స్‌లో పడాలంటే బంతులను కొట్టాల్సిందే. అయితే, ఈ డ్రైవ్-ఇన్ థియేటర్లు ఆక్వా గోల్ఫ్ కోర్స్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఓపెన్ థియేటర్‌లో ఎన్ని కార్లు ఉండవచ్చు? టికెట్ ధర ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి డ్రైవ్ ఇన్ థియేటర్ అందుబాటులోకి వస్తే నగరవాసులకు సినిమాలను చూడటంలో కొత్త అనుభూతి కలుగుతుంది.
Sandhya Sreedhar Rao: నేను ఎవరినీ మోసం చేయలేదు.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి

Exit mobile version