Fevikwik Treatment: గాయం తగిలి వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్ కు అనుకోని అనుభవం ఎదురైంది. తలకు దెబ్బ తగిలి ఆసుపత్రికి వెళితే చికిత్స చేయాల్సింది పోయి దానికి వెరైటీ లెవల్ లో ట్రీట్మెంట్ చేసి అందరికి షాక్ కు గురిచేశారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ వైద్యం కాస్త వైరల్ కావడంతో ప్రజలు అదెక్కడి వైద్యం రా మావా అంటూ ముక్కున వేలుసుకుంటున్నారు.
కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా లింగసూగూరుకు చెందిన వంశీకృష్ణ, సునీత దంపతులు తమ బంధువుల ఇంట్లో పెళ్లి ఉండటంతో రెండ్రోజుల క్రితం జోగులాంబ గద్వాల జిల్లా అయిజకు వెళ్లారు. వీరికి ఏడేళ్ల కుమారుడు ప్రవీణ్ చౌదరి గురువారం రాత్రి బయట ఆడుకుంటూ కిందపడ్డాడు. దీంతో ఎడమ కంటికి పైన తీవ్ర గాయమైంది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గాయం లోతుగా కావటంతో అక్కడ కుట్లు పడాల్సి ఉంది. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం కుట్లకు బదులు.. ఫెవిక్విక్ అంటించి వైద్యం చేశారు. అది గుర్తించిన బాలుడి తండ్రి కృష్ణవంశీ ఆసుపత్రి వైద్యులను నిలదీశారు. ఫెవిక్విక్‌తో అంటించి వైద్యం చేయటమేంటని మండిపడ్డారు.
అంతే కాకుండా ఇన్‌ఫెక్షన్ అయితే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది పొరపాటు చేసి ఉండొచ్చని, బాలుడికి ఏమీ కాదని ఆసుపత్రిలోని డాక్టర్ కృష్ణ వంశీకి నచ్చజెప్పాడు. ఏమైనా జరిగితే తాను బాధ్యతవహిస్తానని తండ్రికి హామీ ఇచ్చాడు. శాంతించని బాలుడి తండ్రి అయిజ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. కాగా.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫెవిక్విక్‌తో అంటించారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అయితే ఈ వ్యవహారం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఫెవిక్విక్‌తో వైద్యం చేయటమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ హాస్పటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Health Tips : శరీరానికి హాని కలిగించే ఆహారాలు ఏంటో తెలుసా..?