DK Aruna Gives Clarity On TRS Allegations: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో విచారణ జరగకుండా అడ్డుకునేలా హైకోర్టులో బీజేపీ పిటీషన్ దాఖలు చేసిందని టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అబద్ధమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వివరణ ఇచ్చారు. ఫాంహౌస్ ఫైల్స్ వ్యవహారంపై తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారని, ఆ కుట్రదారులెవరో తేలాలంటే హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. అలా కోరడంలో తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణపై బీజేపీకి ఏ మాత్రం నమ్మకం లేదని.. ఎందుకంటే, ఈ ఫాంహౌస్ ఫైల్స్ కుట్రదారుడు సీఎం కేసీఆరేనన్నది తమ అనుమానమని చెప్పారు. కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్న సమయంలోనే.. గత సాంప్రదాయాలకు భిన్నంగా కేసీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి, ఆ వీడియో వెనకాల ఉన్న ఉద్దేశాలను వెల్లడించారని, బీజేపీపై ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
అలాంటప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సీఎం ఉద్దేశాలకు భిన్నంగా ఎలా విచారణ జరపగలదు? అని డీకే అరుణ ప్రశ్నించారు. పైగా.. సీఎం ఉద్దేశాలు రాష్ట్రస్థాయి సిట్ దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోని దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా ఈ వ్యవహారంపై విచారణ జరిపే అవకాశాలు ఎంత మాత్రం లేవన్నారు. అందుకే.. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరపాలని కోరుతూ, హైకోర్టు ఫుల్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశామని క్లారిటీ ఇచ్చారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, అందుకే న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలోనే సిట్ విచారణ జరపాలని కోరుతున్నామన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై కేసీఆర్ సైతం దేశంలోని న్యాయ మూర్తులందరికీ లేఖ రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినా.. న్యాయ వ్యవస్థ పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరుకుంటే, కేసీఆర్‌కు వచ్చిన అభ్యంతరాలేమిటి? అని నిలదీశారు. కేసీఆర్‌కు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంటే.. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో సిట్ విచారణ జరిపేందుకు అంగీకరించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సైతం తమకు కేసీఆర్ నియమించిన సిట్‌పై నమ్మకం లేదన్నారు. ఈ కుట్రంలో సీఎం హస్తముందని ఆరోపించిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ వల్ల వాస్తవాలెలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సీఎం కేసీఆర్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే.. బీజేపీ పేరును పదేపదే ఉచ్చరించారన్నారు. దాని వల్ల బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగిందన్నారు. అందుకే హైకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు, చేసి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ, ఈరోజు ఫుల్ బెంచ్ ఎదుట పిటిషన్ దాఖలు చేశామన్నారు. తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.