NTV Telugu Site icon

BRS MLC: ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్‌కుమార్‌, చల్లా

Brs Mlc

Brs Mlc

BRS MLC: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, చల్లా వెంకట్రామ్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఉదయం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఛాంబర్‌లో కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, మల్లార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై నూతన ఎమ్మెల్సీలను అభినందించారు.

దేశపతి శ్రీనివాస్ , నవీన్ కుమార్, చల్లా వెంకట్రాంరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే.. ఈ ముగ్గురు బీఆర్ఎస్ అభ్యర్ధులు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 9వ తేదీన నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు మినహా ఇతర పార్టీల అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా అధికారులు ప్రకటించారు. దీంతో రొటర్నింగ్ అధికారి నుండి ఎన్నికైనా అభ్యర్ధులు ధృవీకరణ పత్రాలు అందుకున్నారు.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నేపథ్యంలో నవీన్‌కుమార్‌, దేశపతి శ్రీనివాస్‌, చల్లా వెంకట్రాంరెడ్డి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారిని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. నవీన్ కుమార్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనకు ఎమ్మెల్సీగా కేసీఆర్ మరోసారి అవకాశం కల్పించారు. కొత్తగా దేశపతి శ్రీనివాస్ కు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఆలంపూర్ నియోజకవర్గంతో పాటు రాయలసీమలో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున చల్లా వెంకట్రాంరెడ్డికి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించారు.