తెలంగాణలోని ఆదివాసీలు ఎక్కువగా గుస్సాడీ నృత్యం చేస్తుంటారు. దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది. కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకతగా చెబుతారు. ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుతం టెక్నాలజీ యుగంలోనూ కొనసాగుతోంది. ఈ కళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోనూ కనిపిస్తుంది.
గుస్సాడీ నాట్యం శివుడి ప్రతిరూపం, యత్మసూరు దేవత స్వరూపంగా భావిస్తారు. ప్రకృతి ఆరాధనలో ఇది ఒక భాగమని ఆదివాసీ పెద్దలు చెబుతారు.ఆదివాసీ గూడేల్లో దీపావళి పండుగకు వారం ముందు మొదలయ్యే దండారీ ఉత్సవాల్లో గుస్సాడీ ప్రదర్శనలు అమితంగా ఆకర్షిస్తాయి. పురుషులు మాత్రమే గుస్సాడీ వేషధారణ వేస్తారు.
గుస్సాడీగా ఉన్న వ్యక్తి ఎంతో నియమనిష్ఠలతో దండారీ పూర్తయ్యే వరకూ కఠిన నియమాలు పాటించాలి. తలపై నెమలి టోపీ చేతిలో దండం, భుజానికి జింక తోలు, ఒళ్లంతా బూడిద, చేతికి పూసలు, రుద్రాక్షలు, కంకణాలు, గుబురు మీసాలు, గడ్డాలతో దీక్ష కొనసాగిస్తారు. వారం, పది రోజులు స్నానం చేయరు. ఒక్కో నెమలి టోపీలో వెయ్యికి పైగా ఈకలు అమర్చుతారు. కొందరు ఆడ వేషంలోనూ ఆకట్టుకుంటారు.
నృత్యం చేసేప్పుడు సంప్రదాయ వాయిద్యాలైన తుడుం, పిప్రి, కాలికం, డప్పు, గుమెలా, ధోల్, వెట్టి, కర్ర తో వాయిస్తూ.. ఎంతో రమణీయంగా పాడుతుంటారు. కష్ట సుఖాలు, సంతోషాన్ని ఆనందాన్ని నాట్యంలో వ్యక్తపరుస్తారు. సాధారణంగా ఈ నృత్యాన్ని దండారీలోనే ప్రదర్శిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో గుస్సాడీ డ్యాన్స్ చేసే గ్రూపులకు 10 వేల రూపాయలు సాయం అందిస్తారు.