ఖైరతాబాద్ నియోజకవర్గంలో దాదాపు 20 వేల ఓట్లను అన్యాయంగా తొలగించారంటూ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషన్ అధికారులు వెంటనే స్పందించి, తొలగించిన ఆ 20,000 ఓట్లన్నింటినీ మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అలా చేయని పక్షంలో నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చుతాయని, ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందని హెచ్చరించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఆందోళన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
బిజెపితో కుమ్మక్కై ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఆరోపణ
హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ‘ఓట్ చోరీ’ జరుగుతోందని, దీని నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన దానం నాగేందర్ అన్నారు. కొంతమంది అధికారులు బిజెపి నాయకులతో కుమ్మక్కై, వారి ఆదేశాల మేరకు ఓట్లను తొలగించే కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. 2000, 2002 సంవత్సరాల నుంచి నివాసముంటూ, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్న జెన్యూన్ ఓటర్ల ఓట్లను ఇప్పుడు కావాలని జాబితా నుంచి తీసేశారని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఎన్నికల కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్
బిజెపితో కొల్యూడ్ అయి నిజమైన ఓటర్ల ఓట్లను తీపించే ప్రయత్నం చేస్తున్న అధికారులపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దానం నాగేందర్ పట్టుబట్టారు. అర్హులైన పౌరులను ఓటర్ జాబితా నుంచి తొలగించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇప్పటివరకు తొలగించిన 20,000 ఓట్లను అడిషనల్ లిస్టు ద్వారా మళ్లీ చేర్చి, ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ నిరసనల సెగ ప్రభుత్వాన్ని, ఈసీని చుట్టుముడుతుందని హెచ్చరించారు.

