Site icon NTV Telugu

Damodara Raja Narasimha : సీజనల్‌ వ్యాధులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక ప్రకటన

Minister Damodara Raja Narasimha

Minister Damodara Raja Narasimha

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేండ్లతో పోల్చితే, ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ చికున్‌గున్యా కేసులు 361 నమోదవగా, ఈ ఏడాది జనవర్ నుంచి సెప్టెంబర్ వరకూ 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో గతేడాది 226 మలేరియా కేసులు నమోదవగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే వచ్చాయన్నారు.

గతేడాది టైఫాయిడ్ కేసులు 10,149 నమోదవగా, ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు 2900 తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల ప్రభావం తక్కువగా ఉండడం అభినందనీయమన్నారు. మొత్తంగా చూసినప్పుడు కేసులు తక్కువగా ఉన్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్‌, మరో నాలుగైదు జిల్లాల్లో స్వల్పంగా కేసులు పెరిగాయని, ఆయా జిల్లాల్లో యాంటిలార్వల్ ఆపరేషన్‌ను విస్తృతం చేయాలన్నారు.

FASTag Recharge: వాహనదారులు ఈజీగా రూ. 1000 పొందే ఛాన్స్.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయని, ఆయా జిల్లాల్లోని హాస్పిటళ్లలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని అప్రమత్తం చేయాలని మంత్రి సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు, ఆ మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

క్షేత్రస్థాయిలో పనిచేసే వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, ప్రజలకు అవగాహన కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు‌. వర్షాలు పడుతున్న జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పర్యటించాలని మంత్రి ఆదేశించారు. ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నట్టే, ఇంటి పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలను ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని మంత్రి సూచించారు. ఒకవేళ సీజనల్ వ్యాధుల బారినపడితే, ప్రభుత్వ దవాఖాన్ల వైద్య సేవలను ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. ప్రభుత్వ దవాఖాన్లలో అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

Renault Kwid E-Tech: రెనాల్ట్ నుంచి క్విడ్ ఇ-టెక్ ఎలక్ట్రిక్ కారు విడుదల.. సింగిల్ ఛార్జ్ తో 250KM రేంజ్

Exit mobile version