NTV Telugu Site icon

D. Sridhar Babu: అలుపెరుగని పోరాటంతో ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం..

D. Sridhar Babu

D. Sridhar Babu

D. Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అలుపెరుగని పోరాటాలు, బలిదానాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఈ సంద‌ర్భంగా వారు చేసిన సేవ‌ల‌ను గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం త‌మ ప్రాణాల‌ను అర్పించిన అమ‌రుల‌ త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యం ఉందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ‌ ఫలాలు అందరికీ స‌మానంగా అందినప్పుడే అమరులకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న కోసం పోరాడిన ఉద్య‌మకారుల‌కు, స‌క‌ల జ‌నుల‌కు, ప్ర‌త్యేక రాష్ట్ర అకాంక్షను గౌర‌వించి మ‌ద్ధ‌తు తెలిపిన ప్ర‌తీ ఒక్క‌రికీ, తెలంగాణ క‌ల‌ను సాకారం చేసిన సోనియా గాంధీకి ఈ సంద‌ర్భంగా మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు ప‌ట్టం క‌ట్టార‌ని పేర్కొన్నారు.

Read also: TSRTC MD VC Sajjanar: గుడ్ న్యూస్.. త్వరలోనే టీజీఎస్ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ..

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధే ద్యేయంగా సీయం రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర‌జా పాలన కొనసాగిస్తుంద‌ని అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తుంద‌ని తెలిపారు. అన్నివ‌ర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మ‌న్న‌న‌ల‌ను పొందుతున్నదని వివ‌రించారు.

యావత్‌ తెలంగాణ సమాజం యొక్క మ‌నోభావాల‌కు అనుగుణంగా, ప్ర‌జా సంఘాలు, పౌర సంస్థ‌లు, ఉద్యోగ సంఘాలతో సంప్ర‌దిస్తూ… వారి అభిప్రాయాల‌ను గౌర‌విస్తూ…ప్ర‌జాస్వామిక పాల‌నను అందిస్తూ… కాంగ్రెస్ ప్ర‌భుత్వం నూతన ఒరవడిని సృష్టించిందని పున‌రుద్ఘాటించారు. తెలంగాణాలో సకాలంలో వర్షాలు పడి, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రములో, ప్రజలు అందించిన కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రతీ ఆకాంక్ష నెరవేరేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
Jaya Jaya Telangana: తెలంగాణ గీతం ఆవిష్కరణ.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ