Site icon NTV Telugu

Cyberabad CP Stephen Raveendra: పబ్‌ల యాజమాన్యంతో సమావేశం.. ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవు

Cp Stephen Ravindra

Cp Stephen Ravindra

Cyberabad CP Stephen Raveendra Holds Review Meeting With Pub Owners: సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌ పరిధిలోని పబ్‌ల యాజమాన్యంతో సీపీ స్టీఫెన్ రవీంద్ర సమావేశం నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల గురించి అవగాహన కల్పించిన ఆయన.. లైసెన్సింగ్ నిబంధనలకు లోబడి ఉండాలని సూచించారు. మైనర్లను పబ్‌లలోకి అనుమతించొద్దని అన్నారు. నిబంధనలకు లోబడి శబ్దాలు/ధ్వని స్థాయిలు ఉండాలని తెలిపారు. బ్యాకప్‌తో కూడిన సీసీటీవీ కెమెరాల ఫీడ్‌ను పర్యవేక్షించడానికి, ప్రాంగణాన్ని సౌండ్‌ప్రూఫ్ చేయడానికి, వాలెట్ డ్రైవర్‌లను నిమగ్నం చేయడానికి, కస్టమర్‌లను సిబ్బంది పరీక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

సైబరాబాద్ పరిధిలోని పబ్‌ల నిర్వహణ బాధ్యతాయుతంగా నిర్వహించి.. నగరంతో పాటు రాష్ట్ర ఖ్యాతిని నిలబెట్టాలని సీపీ కోరారు. సౌండ్‌ పొల్యూషన్‌, పార్కింగ్‌ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యానిదే అని అన్నారు. ముఖ్యంగా.. రాత్రి 10 గంటల తర్వాత సౌండ్ పొల్యూషన్ లేకుండా చూడాలని ఆదేశించారు. పబ్బులపై ప్రజల నుండి కొన్ని ఫిర్యాదులు వచ్చినందుకే ఈ సమీక్ష నిర్వహించడం జరిగిందని.. నివాసితులకు అసౌకర్యం కలిగించొద్దని చెప్పారు. బాధ్యతాయుతమైన రీతిలో వ్యాపారాన్ని నదుపుకోవాలని.. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి, పౌరులకు ఎలాంటి అసౌకర్యాన్ని కల్పించొద్దని హెచ్చరించారు. స్థానికుల నుంచి ఏ చిన్నపాటి ఫిర్యాదు వచ్చినా.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలావుండగా.. హైదరాబాద్‌లో పబ్ నిర్వహణపై ఇటీవల హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాత్రి 10 దాటితే పబ్స్‌లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం.. లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఇచ్చింది. అయితే.. హైకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ, పబ్ యాజమాన్యాలు మునుపటిలాగే వ్యవహరిస్తుండడంతో ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీపీ స్టీఫెన్ రవీంద్ర మరోసారి హైకోర్టు ఆదేశాలపై అవగాహన కల్పించి.. నిబంధనల్ని ఉల్లంఘించొద్దని సీరియస్‌గా హెచ్చరించారు.

Exit mobile version